నయీం నేరచరిత్ర.. పాపాల పుట్ట.. కీలక అనుచరుడి అరెస్టు.

కరుడుగట్టిన గ్యాంగ్ స్టర్ నయీం దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఎక్కడికైనా వెళ్లి హుందాగా బతుకుదాం అన్న పాపానికి సొంత బావ నదీంనే హతమార్చిన ఈ కిరాతకుడు మరో ఘోరానికి కూడా పాల్పడ్డాడని సిట్ పోలీసుల విచారణలో వెల్లడైంది. నయీం కేసును విచారిస్తున్న సిట్‌ తాజాగా మరిన్ని కీలక వివరాలను వెల్లడించింది. 17 ఏళ్ల నస్రీన్‌ను నయీం కిరాతకంగా హత్య చేశాడని వెల్లడించింది. నార్సింగి మంచిరేవులలో తాజాగా పోలీసులు వెలికితీసిన నస్రీన్‌ అస్థిపంజరాన్ని పోలీసులు గుర్తించారు.

సిట్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నయీం ఇంట్లో ఉండే నస్రీన్‌ ఓరోజు ఫంక్షన్‌ కోసం రెడీ అయింది. అయితే ఆ ఫంక్షన్‌కు వెళ్లొద్దని నయీం ఆదేశించాడు. ఇది నస్రీన్‌కు నచ్చలేదు. తనను ఇంట్లో పెట్టి బంధించడాన్ని ఆమె వ్యతిరేకించింది. నయీం అప్పగించిన పనులు చేయనని మొండికేసింది. ఫంక్షన్లకు నేను ఎందుకు వెళ్లొద్దంటూ నయీంను ప్రశ్నించింది. తనను ఇలాగే బంధిస్తే బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది.

దీంతో నయీం రెచ్చిపోయి కిరాతకంగా మారాడు. అత్యంత పాశవికంగా ఆమెను కొట్టి.. కిరాతకంగా పెద్దమొత్తంలో నిద్రమాత్రలు మింగించాడు. నిద్రలో నస్రీన్‌ ప్రాణాలు విడించింది. ఆమె మృతదేహాన్ని నార్సింగిలోని మంచిరేవులలో పాతించాడని సిట్‌ పోలీసులు తెలిపారు. మరోవైపు నయీం కేసు ప్రాథమిక దర్యాప్తు మరో మూడు రోజుల్లో పూర్తికానుంది. ఇప్పటి వరకు ఈ కేసులో 33 మంది నయీం అనుచరులను అరెస్ట్ చేయగా, రూ.143 కోట్ల విలువైన నయీం ఆస్తులను సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.

ఇదిలావుండగా, నయీమ్ భూమి లావాదేవీలను చక్కబెట్టడంలో కీలకంగా వ్యవహరించిన అతని అనుచరులపై సిట్ అధికారులు ప్రధానంగా దృష్టి సారించారు. నయీమ్‌ అనుచరులైన సామ సంజీవరెడ్డి, శ్రీహరి తమను బెదిరించి ఆస్తులు కాజేశారని చినవెంకట్‌రెడ్డి, మల్లమ్మ, లయన్‌ లింగారెడ్డి.. ఆదిభట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగానే ఎల్‌బీ నగర్‌ జోన్‌లోకి వచ్చే హయత్‌నగర్‌ డివిజన్‌లోని సామనగర్‌లో నివాసం ఉండే సంజీవరెడ్డి ఇంటిపై సిట్‌ పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. అనంతరం హయత్ నగర్ లోని ఓ ఇంట్లో తలదాచుకున్న సంజీవరెడ్డిని సిట్ పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు.