నయీం హర్రర్ కధలు ముగిసేదెప్పుడో?

గ్యాంగ్ స్టార్ నయీం ఎన్ కౌంటరే పెద్ద సంచలన వార్త అనుకొంటే, ఆ రోజు నుంచి నిత్యం బయటపడుతున్న వార్తలు అంతకంటే ఎక్కువ సంచలనమే సృష్టిస్తున్నాయి. నయీం ఇంట్లో దొరికిన డబ్బు, ఆస్తి పత్రాలు, కిడ్నాపులు, హత్యలకి అతను ఎంచుకొన్న విధానాలు, పోలీసుల నుంచి తప్పించుకోవడానికి అతను వేసిన మారువేషాలు, రాజకీయ నాయకులు, పోలీస్ అధికారులు, సినీ పరిశ్రమలోని ప్రముఖులతో అతనికున్న సంబంధాలు, అతని కిరాతకాల గురించి వింటుంటే ఎవరికైనా ఒళ్ళు గగుర్పొడవకమానదు.

తాజాగా భువనగిరికి చెందిన నాగేంద్ర అనే రైస్ మిల్ వ్యాపారి ఈనెల 17న భువనగిరి పోలీసులకి చేసిన ఫిర్యాదులో పేర్కొన్న విషయాలు ఇంకా దిగ్బ్రాంతి కలిగిస్తున్నాయి. నయీం తనని రూ.5 కోట్లు చెల్లించమని బెదిరించాడని, చివరికి అతికష్టం మీద కోటి రూపాయలు చెల్లించి బయటపడ్డానని చెప్పాడు. నయీం బారి నుంచి తనకు రక్షణ కల్పించవలసిందిగా తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ ని కోరగా ఆయన నయీంతో మాట్లాడుకొని సెటిల్ చేసుకొమ్మన్నారని, ఆ తరువాత తను అనారోగ్యం కారణంగా నయీంతో మాట్లాడలేకపోతే విద్యాసాగర్ ఫోన్ చేసి నయీంతో వ్యవహారం సెటిల్ చేసుకోమని హెచ్చరించారని నాగ్రేంద్ర తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇంకా దిగ్బ్రాంతి కలిగించే విషయం ఏమిటంటే తను నయీంని కలిసినప్పుడు, తాను అడిగినట్లు ఐదు కోట్లు చెల్లించకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుమారుడిని ఎవరికీ అనుమానం రాకుండా కార్ యాక్సిడెంట్ చేసి హత్య చేసినట్లే నిన్నూ చంపేస్తామని నయీం బెదిరించాడని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అంటే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా నయీం బాధితుడేనని, అతని కొడుకు కారు యాక్సిడెంట్ లో కాక నయీం చేతిలో చనిపోయాడనే సంగతి ఇప్పుడే బయటపడింది. చిన్న సినిమాల నిర్మాత నట్టి కుమార్ కూడా చాలా దిగ్భ్రాంతి కలిగించే విషయాలు బయటపెట్టాడు. నయీం తనని డబ్బు కోసం వేధించేవాడని, ఒకసారి ఏపి కార్మికశాఖ మంత్రి అచ్చెం నాయుడిని విమానంలో కలిసినప్పుడు ఆయన సహాయం కోరితే, ఆయన నయీంతో మాట్లాడి వ్యవహారం సెటిల్ చేసుకోమని సలహా ఇచ్చారని చెప్పారు. నయీం నేర సామ్రాజ్యం రెండు తెలుగు రాష్ట్రాలకి విస్తరించిందనే సంగతి నట్టి కుమార్ మాటలతో బయటపడింది.

నయీం ఎన్ కౌంటర్ అయ్యే రోజు వరకు కూడా అతను ఇన్ని ఆగడాలకి పాల్పడుతుంటే, తెలంగాణ ప్రభుత్వం అతనిని అరెస్ట్ చేసే సాహసం కూడా చేయలేకపోయింది. ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారం చేపట్టిన తరువాత హైదరాబాద్ లో పోలీస్ వ్యవస్థని ఆధునీకరించి, శాంతి భద్రతలని చాలా గొప్పగా అదుపుచేస్తున్నామని గొప్పలు చెప్పుకొనేవారు. మంత్రులు, పోలీస్ ఉన్నతాధికారులు కూడా అదే విధంగా మాట్లాడేవారు. కానీ నయీం ఎన్ కౌంటర్ తరువాత వారిలో చాలా మంది నయీం బాధితులేనని తేటతెల్లం అవుతోంది. అతని కిరాతకాలు భరించలేనంతగా మరీ మితిమీరిపోయిన తరువాతనే ప్రభుత్వంలో చలనం కలిగి చివరికి నయీం ఎన్ కౌంటర్ తో బాధితులందరికీ విముక్తి కల్పించినట్లు భావించాలేమో? అయితే నయీం శకం ముగిసినప్పటికీ అతని గురించి నేటికీ రోజుకో కొత్త విషయం బయటపడుతూనే ఉంది. అది ఎవరో ఒక ప్రముఖ వ్యక్తిని రోడ్డున పడేస్తూనే ఉండటం విశేషం. ఈ నయీం హర్రర్ కధలు ఇంకా ఎన్ని రోజులు వినాలో ఇంకా ఎంత మంది ప్రముఖుల పేర్లు బయటపడుతాయో ఏమో?