వీసీల నియామకాలలో టిఆర్ఎస్ ప్రభుత్వానికి సుప్రీంలో ఊరట

తెలంగాణ ప్రభుత్వానికి వైస్-ఛాన్సిలర్ల నియామకం కేసులో సుప్రీం కోర్టులో ఊరట లభించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించి, నియామకాలలో యధాతధ స్థితిని కొనసాగించాలని ఉత్తర్వులు జారీ చేసి, కేసుని నెల రోజులకి వాయిదా వేసింది. అంటే తెలంగాణ ప్రభుత్వం చేసిన వైస్-ఛాన్సిలర్ల నియామకం చెల్లుతుందని స్పష్టం అయ్యింది.  

వీసీల నియామకానికి కనీసం 10ఏళ్ల అనుభవం ఉండాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్ నిబంధన ఉంది. కానీ దానిని ఐదేళ్ళకి తగ్గిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఒక జీవో జారీ చేసి దాని ప్రకారమే రాష్ట్రంలో ఆరు యూనివర్సిటీలకి వైస్-ఛాన్సిలర్లని నియమించింది. ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన ఒక ప్రొఫెసర్ ఆ నిర్ణయాన్ని హైకోర్టులో సవాలు చేయగా, హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పు పడుతూ ఆ నియమకాలని రద్దు చేసింది. దానిపై ప్రభుత్వం సుప్రీం కోర్టుని ఆశ్రయించగా, ప్రభుత్వానికి ఊరట కల్పిస్తూ తాత్కాలికంగా స్టే మంజూరు చేసింది. వీసీల నియామకం కోసం కనీస అనుభవం ఉండాలనే విషయంపై తదుపరి విచారణలో సూచిస్తామని సుప్రీం కోర్టు చెప్పినట్లు సమాచారం.

నిమ్స్ ప్రాజెక్టు భూసేకరణ కోసం జారీ చేసిన జీవోపై కూడా హైకోర్టు సింగిల్ జడ్జ్ బెంచ్ లో తెలంగాణ ప్రభుత్వానికి మొదట ఎదురుదెబ్బ తగిలినప్పటికీ, తరువాత డివిజన్ బెంచ్ లో అనుకూలంగా తీర్పు వచ్చింది. వీసీల నియామకం కేసులో కూడా ఇవ్వాళ సుప్రీం కోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు రావడంతో చాలా ఊరట లభించినట్లే భావించవచ్చు.

తెలంగాణలో జిల్లాల పునర్విభజన విషయంలో కూడా అంతా ముఖ్యమంత్రి కెసిఆర్ కోరుకొన్నట్లుగానే సాగుతోంది. కొద్ది సేపటి క్రితమే ఒక్క హైదరాబాద్ తప్ప మిగిలిన అన్ని జిల్లాల కోసం ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రజలు, ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ఏవైనా అభ్యంతరాలు, సూచనలు, సలహాలు ఉంటే నెల రోజుల్లోగా జిల్లా కలెక్టరేట్లకి సమర్పించవలసి ఉంటుంది. వాటిని బట్టే అవసరమైతే మళ్ళీ మార్పులు చేర్పులు చేసి తుది నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఈ సానుకూల పరిణామాలన్నిటినీ చూస్తే తెలంగాణ ప్రభుత్వానికి గ్రహాలు మళ్ళీ అనుకూలంగా మారినట్లే కనిపిస్తోంది.