టిఆర్ఎస్ ని విమర్శిస్తే టిడిపి బలపడుతుందా?

టిడిపి ప్రధాన కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో మొదటి రెండు అంతస్తులని తెలంగాణ టిడిపికి కేటాయించారు. రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తదితరులు దానిలో నిన్న పార్టీ కార్యక్రమాలు ప్రారంభించారు. పార్టీ నేతలు సమావేశమయ్యి పార్టీ పరిస్థితి గురించి సమీక్షించుకోవడం, దానిని బలోపేతం చేసుకోవడం కోసం అవసరమైన ప్రణాళికలు రూపొందించుకోవడం వంటి నిర్మాణాత్మకమైన పనులను పక్కన బెట్టి, తెలంగాణ ప్రభుత్వం దాని ముఖ్యమంత్రి కెసిఆర్ పై విమర్శలు గుప్పించారు.

కెసిఆర్ హామీలను నెరవేర్చలేదని, హైదరాబాద్ ని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతానని చెప్పి చెత్త నగరంగా మార్చేశారని రేవంత్ రెడ్డి విమర్శించారు. చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో తెలంగాణ లో టిడిపిని మళ్ళీ అధికారంలో తీసుకువస్తామని ఎల్.రమణ చెప్పారు. టిఆర్ఎస్ ప్రభుత్వం రెండేళ్ళలో రెండు లక్షల కోట్లు బడ్జెట్ లో చూపించి ఖర్చు చేసిందని, కానీ దానిని ఎక్కడ ఖర్చు చేసిందో దాని వలన రాష్ట్రంలో ఎవరికి మేలు కలిగిందో కనబడటం లేదని ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలో తమ పార్టీ పరిస్థితి గురించి సమీక్షించుకొని, ‘డ్యామేజ్ కంట్రోల్’ కోసం ప్రయత్నించకుండా ఈ విధంగా టిఆర్ఎస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై ఆరోపణలు చేయడం వలన టిడిపికి ఏమీ ప్రయోజనం కలుగదు. పైగా తెలంగాణాణ రాజకీయాలకి, పార్టీకి, హైదరాబాద్ కి కూడా దూరంగా ఉంటున్న చంద్రబాబు మార్గ దర్శకత్వంలో అధికారంలోకి వస్తామని ఎల్.రమణ చెప్పుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది.  

కొంతకాలం క్రితం టిడిపి నుంచి టిఆర్ఎస్ లో చేరిన ప్రదీప్ చౌదరి మళ్ళీ నిన్న సొంత గూటికి చేరుకొన్నారు. ఆయన చేరిక ఒక్కటే టిడిపికి నిన్న చిన్న సానుకూల అంశంగా కనపడింది. టిఆర్ఎస్ పార్టీలో చేరిన టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు కూడా ఆ పార్టీలో ఇమడలేక చాలా ఇబ్బంది పడుతున్నారని ప్రదీప్ చౌదరి అన్నారు. అదే నిజమైతే ఆయనతో పాటు, లేదా త్వరలో మరికొందరు నేతలు టిడిపి గూటికి చేరుకోవాలి. లేకుంటే టిడిపి పరిస్థితిలో ఎటువంటి మార్పు ఉండకపోవచ్చు.