రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్నకు తృటిలో ప్రమాదం తప్పింది. ఆదిలాబాద్ జిల్లాలో జరుగనున్న కార్యక్రమాల్లో మంత్రి పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి బయలు దేరారు. కాన్వాయ్ వాహనాలు 44వ నెంబరు జాతీయ రహదారిపై డిచ్పల్లి మండలంలోని టీఎస్ఎస్పీ ఏడో బెటాలియన్ సమీపంలోకి చేరుకున్నాయి. అదే సమయంలో కాన్వాయ్ ముందుగా కర్నూలు నుంచి నిర్మల్‌కు వెళుతున్న బొలెరో వాహనం వెనుక టైరు అకస్మాత్తుగా ఊడి పోవడంతో ఆ వాహనం రోడ్డుపై నిలిచి పోయింది. వెనక నుంచి వేగంగా వస్తున్న మంత్రి కాన్వాయ్‌లోని ఎస్కార్ట్ వాహనం రోడ్డుపై నిలిచి పోయిన వాహనాన్ని ఢీకొట్టింది.
ఆ వెనకనే మంత్రి జోగు రామన్న వాహనం ఉంది. మంత్రి కారు డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి పక్కకు తప్పించి సడన్‌బ్రేక్ వేసి వాహనాన్ని నిలిపి వేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఎస్కార్ట్ వాహనంలో ఉన్న పోలీసు సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే తన వాహనం దిగిన మంత్రి ఎస్కార్ట్ వాహనం డ్రైవర్ సుదర్శన్‌ను, ఏఆర్ఎస్సై భూమన్న, సిబ్బందిని పలకరించి ఏవైనా దెబ్బలు తగిలియా అని అడిగి తెలుసుకున్నారు.
ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. డిచ్పల్లి ఎస్సై కట్టా నరేందర్‌రెడ్డి వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. తాను అర్జంటుగా ఆదిలాబాద్ వెళ్లాల్సి ఉందని, ఎస్కార్ట్ వాహనం విషయం చూసుకోమని డిచ్పల్లి పోలీసులకు చెప్పిన మంత్రి కాన్వాయ్‌లో ఇతర వాహనాలు వెంట రాగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ప్రమాదంలో ఎస్కార్ట్ వాహనం ముందు భాగం ధ్వంసమైంది.