ఆగస్ట్ 22న కొత్త జిల్లాలకి నోటిఫికేషన్

తెలంగాణాలో కొత్త జిల్లాల ఏర్పాటుపై చర్చించేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ శనివారం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న 10 జిల్లాలని పునర్విభజించి మరో 17 కొత్త జిల్లాలు, 58 రెవెన్యూ డివిజన్లు, 533 మండలాలని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అదే విషయం అఖిలపక్ష సమావేశానికి హాజరైన ప్రతిపక్షాల నేతలకి తెలిపి వారి అభిప్రాయలు, సూచనలు, సలహాలు కోరారు.

 

అనంతరం కెసిఆర్ మీడియాతో మాట్లాడుతూ, “ఈనెల 22న ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేస్తాము. దానిపై ప్రతిపక్షాలు, ప్రజాలు తమ అభ్యంతరాలు, సూచనలు, సలహాలు ఇచ్చినట్లయితే తదనుగుణంగా అవసరమైన మార్పులు చేర్పులు చేసి తుది నోటిఫికేషన్ విడుదల చేస్తాము. అవసరమైతే మరో రెండు సార్లు అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తాము. సమావేశంలో ప్రతిపక్షాలు కొత్త జిల్లాల ఏర్పాటుకి మేము చేసిన ప్రతిపాదనలని స్వాగతించాయి. కొత్త జిల్లాల ఏర్పాటు పరిపాలనా సౌలభ్యం కోసమే కనుక అందరికి ఆమోదయోగ్యంగా ఉండేవిధంగానే ఏర్పాటు జరుగుతుంది. మా ఎన్నికల మ్యానిఫెస్టోలోనే కొత్త జిల్లాలని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చాము. దానినే ఇప్పుడు అమలు చేస్తున్నాము. దసరా రోజు నుంచి కొత్త జిల్లాలు పనిచేయడం మొదలుపెడతాయి. త్వరలోనే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కొత్త జిల్లాలలో కోర్టుల ఏర్పాటు గురించి మాట్లాడుతాను. అవి ఏర్పాటు అయ్యే వరకు ప్రస్తుతం ఉన్న న్యాయవ్యవస్తే అమలులో ఉంటుంది,” అని ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పారు. 

కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రతిపక్షాలు బహిరంగంగానే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుంటే, అవి తమ ప్రతిపాదనలని స్వాగతించాయని కెసిఆర్ చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తుంది. కొత్త జిల్లాలు పనిచేయడానికి అక్టోబర్ 11వ తేదీని ముహూర్తం కూడా ఖరారు చేసేశారు కనుక ఈ నెల రోజుల్లోనే కొత్త జిల్లాలపై పూర్తి స్పష్టత రావచ్చు.

ఈరోజు అఖిలపక్ష సమావేశంలో ప్రతిపాదించిన జిల్లాలు ఇవే: 

1.ఆదిలాబాద్, 2.కొమురంభీం,3.నిర్మల్,4.కరీంనగర్,5.జగిత్యాల, 6.పెద్దపల్లి, 7.వరంగల్, 8.హన్మకొండ, 9.భూపాలపల్లి(జయశంకర్),10.మహబూబాబాద్,11.ఖమ్మం,12.కొత్తగూడెం,13.నల్లగొండ,14.సూర్యాపేట,15.యాదాద్రి,16.మహబూబ్ నగర్,17.నాగర్ కర్నూల్,18.వనపర్తి, 19.హైదరాబాద్, 20.రంగారెడ్డి (వికారాబాద్), 21.రంగారెడ్డిఅర్బన్(శంషాబాద్), 22.మల్కాజ్ గిరి, 23.సంగారెడ్డి,24.మెదక్, 25.సిద్దిపేట, 26.నిజామాబాద్, 27.కామారెడ్డి జిల్లాలు