సింధుపై వరాల జల్లు..సైనాకి అవమానాలు...ఇదేనా మన క్రీడా స్ఫూర్తి?

మహిళల సింగిల్స్  బ్యాడ్మింటన్ ఒలింపిక్ పోటీలలో వెండి పతకం సాధించిన పివి సింధుపై దేశంలో చాలా రాష్ట్రాలు వరాల జల్లు కురిపిస్తున్నాయి. ఆమెకి తెలంగాణా ప్రభుత్వం కోటి రూపాయలు, ఆంధ్రప్రదేశ్ రూ.3కోట్లు, అమరావతిలో 1,000గజాల స్థలం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో గ్రూప్-1 ఉద్యోగం ఇచ్చాయి. డిల్లీ ప్రభుత్వం సింధూకి రూ.2 కోట్లు మధ్యప్రదేశ్ రూ.50 లక్షలు, భారత బ్యాడ్మింటన్ సమాఖ్య రూ. 50 లక్షలు బహుమానంగా ప్రకటించాయి. ఈ జాబితా ఇంకా పెరుగుతూనే ఉంది. అది చాలా సంతోషకరమే కానీ ఆశ్చర్యకరమైన విషయం కాదు. సింధూతో బాటు ఆమెకి శిక్షణ ఇచ్చిన గోపీ చంద్ కి బారీ బహుమానాలు ప్రకటిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రూ.50 లక్షలు, భారత బ్యాడ్మింటన్ సమాఖ్య రూ.10 లక్షలు బహుమానంగా ప్రకటించాయి. 

ఇదంతా నాణేనికి ఒకవైపు. రెండోవైపు చూస్తే క్రీడలలో వికృత రూపం కూడా కనబడుతుంది. మోకాలి గాయంతో బాధపడుతున్న సైనా నెహ్వాల్ ఒలింపిక్స్ లో సరిగ్గా ఆడలేకపొయ్యారు. ఆ కారణంగా లీగ్ దశలోనే ఆమె ఇంటి ముఖం పట్టవలసి వచ్చింది. అందుకు చాలా మంది బాధపడ్డారు కానీ కొంతమంది ఆమెపై తీవ్ర విమర్శలు, అవహేళన చేస్తూ ట్వీట్ మెసేజ్ లు పెట్టారు. 

ఒక వ్యక్తి “డియర్ సైనా ఇంక నీ బ్యాగ్ సర్దుకో...నీకంటే గొప్పగా అడే ప్లేయర్ సింధూ మాకు దొరికింది,” అని మెసేజ్ పెట్టాడు. విజయాలు సాధించినప్పుడు ఆకాశానికి ఎత్తేయడం, ఓడిపోగానే ఈవిధంగా అవహేళన చేయడం క్రీడాకారుల ఆత్మస్థయిర్యాన్ని ఎంతగా దెబ్బ తీస్తుందో ఆ విమర్శలను, అవహేళనలని ఎదుర్కొన్న క్రీడాకారులకే తెలుస్తుంది. ఒకవేళ సింధూ కనుక ఓడిపోయుంటే ఆమెకూడా ఇలాగే చేదు వ్యాఖ్యలని జీర్ణించుకోవలసి ఉండేది. 

ఇటువంటి అవమానాలని దిగమింగుకొని ఏమీ జరగనట్లుగా ఉండటం మామూలు విషయం కాదు. కానీ సైనా నెహ్వాల్ చాలా హుందాగా బదులిస్తూ “అలాగే వెనక్కి బయలుదేరుతున్నాను. సింధూ నాకంటే చాలా బాగా ఆడింది. ఆమెకి నా అభినందనలు,” అని మెసేజ్ పెట్టింది. 

క్రీడాకారులు గెలిచేవరకు ఎటువంటి గుర్తింపుకి నోచుకోరు. ఎవరూ వారికి ఆదరించరు..ప్రోత్సహించరు. కానీ గెలిస్తే నెత్తిన పెట్టుకొంటారు. ఓడిపోతే ఇదిగో...ఇలాగ సైనా నెహ్వాల్ ని అవమానించినట్లు అవమానిస్తారు కూడా. ఇదేనా మన క్రీడా స్ఫూర్తి? క్రీడాకారులకి ఇచ్చే గౌరవం? అందరూ ఆలోచించాలి