కొత్త జిల్లాల ఏర్పాటుపై నేడే బిగ్ ఫైట్!

తెలంగాణాలో కొత్త జిల్లాల ఏర్పాటు గురించి ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకి ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరుగబోతోంది. దీనికి ఒక్కో పార్టీ తరపున ఇద్దరు చొప్పున ప్రతినిధులని ఆహ్వానించారు. టిఆర్ఎస్ తరపున కె.కేశవరావు, నిరంజన్ రెడ్డి, టిడిపి తరపున ఎల్.రమణ, రావుల చంద్రశేఖర్ రెడ్డి, భాజపా తరపున మల్లారెడ్డి, రామచంద్ర రావు, కాంగ్రెస్ తరపున మల్లు భట్టి విక్రమార్క, షబ్బీర్ అలీ, సిపిఎం తరపున తమ్మినేని వీరభద్రం, జూలకంటి, సిపిఐ నుంచి చాడా వెంకట్ రెడ్డి, మజ్లీస్ తరపున అక్బరుద్దీన్ ఒవైసీ హాజరుకానున్నారు. 

విశేషమేమిటంటే, ఈ సమావేశానికి ముందే జిల్లాల ఏర్పాటుపై అధికార ప్రతిపక్షాలు చాల నిర్దిష్టమైన వైఖరిని ప్రకటించాయి. ముఖ్యమంత్రి కెసిఆర్ జిల్లాల సంఖ్య, వాటి భౌగోళిక సరిహద్దులు, మండలాలు, రెవెన్యూ డివిజన్ల సంఖ్యతో సహా అన్నీ ముందే ఖరారు చేసేశారు. దసరా రోజు నుంచి కొత్త జిల్లాలు పనిచేయడం మొదలుపెడతాయని ఆయన ఇప్పటికే చాలాసార్లు ప్రకటించారు. కనుక ప్రతిపక్షాలకి ఆ వివరాలు తెలిపేందుకే ఈ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయబడినట్లు భావించవచ్చు. 

జిల్లాల ఏర్పాటుపై ప్రతిపక్షాలు చాలా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రజల అవసరాలకి తగ్గట్లుగా లేదా పరిపాలన సౌలభ్యం కోసమో జిల్లాలని విడదీస్తే పరువాలేదు కానీ కెసిఆర్ తన పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసమో లేదా వాస్తు లెక్కల ప్రకారమో లేదా తన అదృష్టసంఖ్య ప్రకారమో విభజించాలని చూస్తే దానికి తాము ఎట్టి పరిస్థితులలో అంగీకరించబోమని స్పష్టంగా చెపుతున్నారు. 

అంటే అధికార, ప్రతిపక్షాలు రెండూ కూడా జిల్లాల ఏర్పాటుపై పూర్తి భిన్నాభిప్రాయాలతో నేడు సమావేశం కానున్నాయని స్పష్టం అవుతోంది. కనుక ఈ సమావేశం అనంతరం వాటి మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు చాలా జోరుగా సాగవచ్చు. కానీ కొత్త జిల్లాల ఏర్పాటు గురించి ముఖ్యమంత్రి కెసిఆర్ ఇప్పటికే తుది నిర్ణయం కూడా తీసుకొన్నారు కనుక ఆ ప్రకారమే కొత్త జిల్లాలు ఏర్పాటు చేయవచ్చు. ఒకవేళ ప్రతిపక్షాల సూచనలను, సలహాలను ఆయన పరిగణనలోకి తీసుకోదలిస్తే ఒకటి రెండు జిల్లాలు తగ్గించవచ్చు. అంతకంటే పెద్దగా మార్పులు చేయకపోవచ్చు.