నయీమే కాదు.. ఆయన కుటుంభసభ్యులది కూడా నేరచరిత్రే.

కరుడుగట్టిన గ్యాంగ్ స్టర్ నయీం గ్యాంగ్స్టర్ నయీమ్ మాత్రమే కాదు అతడి కుటుంబీకులది  కూడా నేర పైశాచికత్వంలో ఏమాత్రం తీసిపోలేదు. నయీమ్ తన బావ నదీం అలియాస్ కొండా విజయ్కుమార్ను హత్య చేయడానికి ఆయన కుటుంబ సభ్యులు కూడా సహకరించినట్లు సిట్ అధికారులు తాజా దర్యాప్తులో వెలుగుచూసింది. నదీం భార్య అయిన తన సోదరితో కలిసే నయీమ్ అతడిని చంపేసినట్లు తెలిసింది. అంతేకాదు ఈ ఘాతుకానికి నయీమ్ తల్లి తాహెరా, భార్య హసీనా సహకరించారని వెల్లడైంది. 

అప్పటికే శృతిమించుతున్న నయీమ్ దారుణాలను చూడలేక వేరు కాపురం పెడదామని.. అతనికి దూరంగా వెళ్లిపోదామని నదీం తన భార్యతో చెప్పడమే అయన పాలిట శాపమైంది. తన నుంచి తన చెల్లిని వేరు చేస్తావా..? అంటూ నయీం తన భావ నదీంపై దారుణానికి ఒడిగట్టినట్లు సమాచారం. నయీమ్ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసు బృందాలు అతడు చేసిన దారుణాలకు సంబంధించిన ఆధారాల సేకరణపై దృష్టి పెట్టాయి. నయీమ్ సోదరి సలీమా మొదటి భర్త ప్రమాదంలో మరణించాడు.

నయీమ్ అనుచరుడైన నల్లగొండ జిల్లా భువనగిరికి చెందిన విజయ్కుమార్.. నదీంగా మారి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అప్పట్లో నయీమ్ తన భార్య హసీనా, తల్లి తాహెరా, సోదరి సలీమా, నదీమ్ తదితరులతో కలసి గగన్పహాడ్ ప్రాంతంలోని పప్పుహౌస్ అనే ఇంట్లో ఉండేవారు. అప్పటికే నేరచరిత్ర కలిగిన నదీమ్ సైతం నయీమ్ చేస్తున్న దారుణాలను చూసి భరించలేకపోయాడు. ఆ గ్యాంగ్కు దూరంగా వెళ్లి బతుకుదామని భార్య సలీమాతో చెప్పాడు. ఈ విషయాన్ని సలీమా తన తల్లికి, నయీమ్కు చెప్పేసింది. దీంతో సుదీర్ఘకాలం తన డ్రైవర్గా పనిచేసిన నదీం బయటకెళ్లిపోతే తన గుట్టుమట్లు బయటకొచ్చే ఆస్కారముందని భావించిన నయీమ్... అతడిని హతమార్చాలని నిర్ణయించుకున్నాడు.

ఓ రోజు రాత్రి పప్పుహౌస్లోని తన బెడ్రూమ్లోకి నదీంను పిలిచి దాడి చేశాడు. తన భార్య హసీనా మెడలోని చున్నీ తీసి నదీం మెడకు ఉరి బిగించాడు. తల్లిని బెడ్రూమ్ బయట కాపలా ఉంచగా.. లోపల నయీమ్ భార్య హసీనా, సోదరి సలీమా రెండువైపులా చున్నీని గట్టిగా లాగి నదీమ్ను చంపేశారు. నయీమ్ ఆ తర్వాత ఫర్హానా, నస్రీన్, కరీనా, సదా, తాహెర్, డ్రైవర్ కిశోర్లతో కలసి మృతదేహాన్ని కారులో తీసుకెళ్లి.. మహబూబ్నగర్ జిల్లా కొత్తూర్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో పెట్రోల్ పోసి దహనం చేశారు. అది జరిగిన ఏడాదికి నయీమ్ తన మకాంను నెక్నాంపూర్కు మార్చాడని సిట్ పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది