ఫైనల్స్ లో సింధు ఓటమి...వెండి పతకమే ఫైనల్

భారత షట్లర్ పివి సింధు బ్యాడ్మింటన్ సింగిల్ ఫైనల్స్ లో కరోలినా మారిన్ చేతిలో ఓడిపోయింది. సుమారు గంటసేపు హోరాహోరీగా సాగిన వారి ఆట చివరి క్షణం వరకు చాలా ఉత్కంటభరితంగాసాగింది. చివరికి కొద్దిలో స్వర్ణ పతకం సింధూ చేజారిపోయింది. 

మొదటి రౌండ్ లో సింధుపై మారిన్ పైచెయ్యి సాధించినప్పటికీ, సింధూ ఏమాత్రం నిరాశ చెందకుండా తనదైన శైలిలో స్మాష్ షాట్లు, ప్లేస్ మెంట్లతో విజ్రుంభించేసి స్కోరుని 19-19కి సమానం చేసింది. రెండవ రౌండ్ లో కూడా మారిన్ సింధుపై ఆధిక్యత ప్రదర్శించింది. కానీ సింధూ కూడా అంతే జోరుగా ఆడటంతో ఆ రౌండ్ ముగిసే సమయానికి స్కోర్ మళ్ళీ 1-1 సమానం అయ్యింది.      

చివరి రౌండ్ లో ఇద్దరూ నువ్వా నేనా అన్నట్లుగా రెచ్చిపోయి షాట్స్ కొడుతూ ఆడారు. మారిన్ 6-1 చేరుకొన్నప్పుడు సింధూ మరింత గట్టిగా పోరాడి స్కోరుని 9-8కి చేర్చగలిగింది. ఆ తరువాత స్కోరుని 10-10కి సమానం చేయడంతో ఎవరు గెలుస్తారని అందరూ ఊపిరి బిగపట్టి ఎదురుచూశారు. మ్యాచ్ నిర్ణయాత్మకమైన దశకి చేరుకోగానే మారిన్ తన సత్తా చాటుకొంటూ వరుసగా నాలుగు పాయింట్లు సాధించి విజయం సాధించింది. అంటే సింధూ రెండు రౌండ్స్ లో ఆమెతో సమానంగా నిలిచి చివరి రౌండ్ లో కేవలం నాలుగు పాయింట్స్ తేడాతో బంగారు పతకాన్ని చేజార్చుకొన్నట్లయింది. ఏమైనప్పటికీ ఈరోజు ఆమె లోకానికి తన సత్తా చాటి చూపింది. దీనితో భారత్ ఖాతాలో ఒక వెండి, కాంస్య పతకం జమా అయ్యాయి