సిపిఎం పాదయాత్ర తెలంగాణా కోసమా..రికార్డుల కోసమా?

స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి సమైక్య రాష్ట్రంలో పాదయాత్రలకి శ్రీకారం చుట్టారు. ఆయన కుమార్తె షర్మిల, వారి బద్ద విరోది చంద్రబాబు నాయుడు కూడా సుమారు 3,000 కిమీ పాదయాత్రలు చేశారు. అ రికార్డులని ఎవరూ ఇంతవరకు అధిగమించలేకపోయారు. వారిలో రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు చేసిన పాదయాత్రల వలన వారు అధికారంలోకి రాగలిగారు కానీ ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్నజగన్మోహన్ రెడ్డికి బదులు ఆయన చెల్లెళ్ళు షర్మిల పాదయాత్ర చేయడం వలన ఆ పాదయాత్ర ఫలం ఆయనకి దక్కలేదు. ఇప్పుడు వారి ముగ్గురు రికార్డులని బ్రేక్ చేయడానికి తెలంగాణాలో సిపిఎం పార్టీ సిద్దం అవుతోంది. తమపార్టీ 4,000 కిమీ పాదయాత్ర చేయడానికి సిద్దం అవుతోందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. 

టిఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో ఆర్ధిక, సామాజిక రంగాలలో సమగ్ర అభివృద్ధి సాధ్యం కాదని అన్నారు. కనుక వాటికి ప్రత్యామ్నాయ మార్గాల గురించి ప్రచారం చేసి ప్రజలని చైతన్యపరచడం ద్వారా టిఆర్ఎస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి, అది తన విధానాలు మార్చుకొనేలా చేయడం కోసమే ఈ మహా పాదయాత్రని చేపట్టబోతున్నామని ఆయన చెప్పారు. దీని కోసం మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీలను సన్నధం చేస్తామని వీరభద్రం ప్రకటించారు. 

రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు పాదయాత్రలు చేసిన తరువాతే అధికారంలోకి వచ్చారు కనుక ఇప్పుడు ఎవరైనా ఆ స్థాయిలో పాదయాత్రలు చేయదలిస్తే అధికారం కోసమేనని ప్రజలు భావించే పరిస్థితి నెలకొని ఉంది. కనుక సిపిఎం మహా పాదయత్రని కూడా అలాగే చూడవలసి వస్తోంది. 

ఆంధ్రా, తెలంగాణాలలో చాలా దశాబ్దాలుగా వామపక్షాలు ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉన్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థపై వాటికి నమ్మకం లేనప్పటికీ అవి మిగిలిన పార్టీలతో ఎన్నికలలో పోటీ పడుతునే ఉన్నాయి. కానీ నేటికీ అవి తమ బూజుపట్టిన సిద్దాంతాలని పట్టుకొని వ్రేలాడుతూనే ఉన్నాయి. అందుకే అవి ప్రజల తరపున దశాబ్దాలుగా పోరాడుతున్నప్పాటికీ అధికారంలోకి రాలేకపోతున్నాయి. 

కనుక ఇప్పుడు సిపిఎం పార్టీ 4,000 కాదు..40,000 కిమీ పాదయాత్రలు చేసినా అధికారంలోకి రాలేదని ఖచ్చితంగా చెప్పవచ్చు. అధికారం కోసం కాదు కేవలం ప్రభుత్వ విధానాలలో లోపాలని తెలిపేందుకే అనుకొంటే దాని కోసం అంత శ్రమపడనవసరమే లేదు. అదేదో నేరుగా రాష్ట్ర ప్రభుత్వానికే మీడియా ద్వారానో, బహిరంగ సభల ద్వారానో చెపితే సరిపోతుంది. కనుక ఈ పాదయాత్రతో సిపిఎం ఏమి సాధించాలనుకొంటోందో చెపితే బాగుంటుంది