కాంగ్రెస్ కి బంగారు పతకం, టిఆర్ఎస్ కి రజతం మరి టిడిపికి?

ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీల నేతల మధ్య సాగునీటి ప్రాజెక్టుల గురించి మాటల యుద్ధం సాగుతోంది. రెండు పార్టీలు కూడా ‘తెలంగాణా కోసం మేమే ఎక్కువ పాటుపడ్డాము అంటే కాదు మేమే ఎక్కువ పాటు పడుతున్నాము’ అని వాదించుకొంటున్నాయి. ఒకదానిపై మరొకటి అవినీతి ఆరోపణలు చేసుకొంటున్నాయి. వారి మాటల యుద్ధం వలన రాష్ట్రానికి, ప్రజలకి ఒరిగేదేమీ ఉండకపోయినా ఈ హడావుడి వలన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పూర్తి స్థాయిలో యాక్టివ్ కాగలిగింది. ఆ రెండూ చేసుకొంటున్న విమర్శలు, ఆరోపణలన వలన కాంగ్రెస్, టిఆర్ఎస్ ప్రభుత్వలలో తప్పులు, లోపాలు, అవినీతి కధలు ప్రజలు వినగలుగుతున్నారు. 

నిజానికి ఈ యుద్ధం మొదలుపెట్టింది టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కానీ ఆయన ఎందుకో సడన్ గా సైలెంట్ అయిపోయారు. ఆయన అందించిన ఆ లీడ్ తో కాంగ్రెస్ పార్టీ  చెలరేగిపోయి బాగానే మైలేజ్ సంపాదించుకొన్నట్లు కనిపిస్తోంది. ఈ సంగతి టిడిపి కూడా గ్రహించి, ఆ పోటీలో వెనుకబడిపోకూడదని అది కూడా మళ్ళీ ఎంట్రీ ఇచ్చింది. రేవంత్ రెడ్డి వేరు కుంపటి పెట్టుకొంటారని ఆ మధ్యన మీడియాలో వార్తలు వచ్చాయి. అవి నిజమో కాదో తెలియదు కానీ రేవంత్ రెడ్డికి బదులు రావుల చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతున్నారిప్పుడు.

ప్రస్తుతం ఒలింపిక్స్, మెడల్స్ గురించి ఎక్కువగా వినపడుతోంది కనుక ఆయన అదే బాషలో మాట్లాడుతూ “అబద్దాలు చెప్పడంలో పోటీ పెట్టినట్లయితే కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలకి బంగారం, రజత పతకాలు దక్కేవి. కాంగ్రెస్ హయంలో జలయజ్ఞం పేరిట ధన యజ్ఞం జరిగింది. ప్రాజెక్టుల పేరుతో కాంగ్రెస్ నేతలు జేబులు నింపుకొన్నారు. ఇప్పుడూ బంగారి తెలంగాణా పేరిట అదే జరుగుతోంది. ప్రాజెక్టుల డిజైన్లని మార్చి టిఆర్ఎస్ ప్రభుత్వం అంచనాలు పెంచేసి విచ్చల విడిగా ప్రజాధనం ఖర్చు చేసేస్తోంది. స్వర్గీయ ఎన్టీఆర్, చంద్రబాబు హయంలోనే తెలంగాణాలో నిజమైన అభివృద్ధి జరిగింది. వారి హయాంలో తెలంగాణాలో మొత్తం 14 ప్రాజెక్టులు ఆరంభం అయితే, కాంగ్రెస్, టిఆర్ఎస్ నేతలు వాటి ప్రస్తావన చేయకుండా గొప్పలు చెప్పుకొంటూ ప్రజలని మభ్య పెడుతున్నారు,” అని ఆరోపించారు. 

రావుల చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి బంగారు పతకం, టిఆర్ఎస్ పార్టీకి రజతపతకం కేటాయించి మధ్యలో ఉండే వెండి పతకం ప్రస్తవన చేయకపోవడం గమనిస్తే అది తమ పార్టీకి అట్టేబెట్టుకొన్నారేమోనని అనుమానించవలసి వస్తోంది.