టిఆర్ఎస్ ప్రభుత్వంపై వైకాపా ఫైర్..దేనికో

తెలంగాణాలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రతిపక్షాలతో చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రేపు అఖిలపక్ష సమావేశం నిర్వహించబోతోంది. కానీ దానికి వైకాపాని ఆహ్వానించకపోవడంతో ఆ పార్టీ నేతలు టిఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “మా పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు, ఒక ఎంపి టిఆర్ఎస్ విసిరేసే ఎంగిలి మెతుకులకి ఆశపడి ఆ పార్టీలో చేరారు. అది చూసి మాపార్టీ టిఆర్ఎస్ లో విలీనం అయిపోయినట్లు కెసిఆర్ భ్రమ పడుతున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుకి మేము వ్యతిరేకం కాదు కానీ కెసిఆర్ అన్నీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. అది కూడా ఏకపక్ష సమావేశంగానే కనబడుతోంది. దానికి అన్ని పార్టీలని ఆహ్వానించి మా పార్టీని ఆహ్వానించకపోవడాన్ని మేము తీవ్రంగా నిరసిస్తున్నాము. రేపటిలోగా మా పార్టీని ఆహ్వానించకపోతే మేము ఆందోళన కార్యక్రమాలు చేపడుతాము. వైసిపిని ప్రభుత్వం గుర్తించకపోయినా తెలంగాణా ప్రజలు గుర్తించారు. అదే మాకు ముఖ్యం,” అని అన్నారు. 

కెసిఆర్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకొంటున్నారు..కంటితుడుపు చర్యగానే అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నారని ఆరోపిస్తున్నప్పుడు మళ్ళీ అటువంటి సమావేశానికి పిలవలేదని వైసిపి బాధపడటం ఎందుకు? మళ్ళీ దానికోసం రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తామని బెదిరించడం ఎందుకు? ప్రజలు గుర్తిస్తే చాలనుకొంటున్నప్పుడు మళ్ళీ ప్రభుత్వం గుర్తించలేదని బాధపడటం దేనికి?

ఇక ఆ పార్టీ మరో ప్రధాన కార్యదర్శి కే.శివకుమార్ లోటస్ పాండ్ లో మేదిఆ సమావేశం ఏర్పాటు చేసి           టిఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. “కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అందుకే కంటి తుడుపు చర్యగా ఈ అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తోంది. టిఆర్ఎస్ ప్రభుత్వం తన రాజకీయ ప్రయోజనాల కోసమే జిల్లాలని విభజిస్తే మేము ప్రజల తరపున దానిని వ్యతిరేకిస్తూ పోరాడుతాము. గతంలో జీవో: 58,59ల ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించినప్పుడు వైసిపిని ఆహ్వానించింది. కానీ ఇప్పుడు ఎందుకు ఆహ్వానించలేదు? రాష్ట్రంలో గుర్తింపు ఉన్న పార్టీలలో మాపార్టీ 3వ స్థానంలో ఉంది. అయినా టిఆర్ఎస్ ప్రభుత్వం మమ్మల్ని అధికారిక కార్యక్రమాలకి ఆహ్వానించడం మానుకొంది. కెసిఆర్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకొంటూ పరిపాలన సాగిస్తున్నారు. కనుక మేము ప్రజల తరపున నిలబడి ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తాము,” అని హెచ్చరించారు. 

తెలంగాణాలో అసలు తన ఉనికిని చాటుకోవడానికే వైసిపి ఇష్టపడదు. కారణాలు అందరికీ తెలిసినవే. ఎన్నికల సమయంలో తప్ప మిగిలిన సమయాలలో అసలు అది ఉందో లేదో కూడా ఎవరికీ తెలియదు. ఈ రెండేళ్లలో తెలంగాణా అనేక సమస్యలు ఎదుర్కొంది. రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు వాటిపై చాలా చురుకుగా వ్యవహరించాయి ఒక్క వైసిపి తప్ప. తెలంగాణాలో వైసిపి లోటస్ పాండ్ లోనో లేకపోతే సాక్షి మీడియాలోనో కనబడుతుంది తప్ప ప్రజల మధ్య కనబడదు. అటువంటి పార్టీని ఎవరైనా ఎందుకు పట్టించుకొంటారు? పట్టించుకోకపోతే అందుకు బాధపడటం ఎందుకు?