ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడాన్ని తాము వ్యతిరేకించబోమని నిజామాబాద్ ఎంపీ, తెలంగాణ ముఖ్యమంత్రి తనయ కల్వకుంట్ల కవిత అన్నారు. కేంద్రం సాయం అంశంలో ఆంధ్రప్రదేశ్తో తాము ఫోటీ పడబోమని అయితే తెలంగాణకు కూడా న్యాయం చేయాలన్నదే తమ అభిమతమని ఆమె అన్నారు. ఎన్నికల సమయంలో అక్కడి పార్టీలు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని తెలిపారు. ప్రత్యేక హోదా కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉద్యమిస్తున్నారని ఆమె అన్నారు. అందుకే తాను గురువారం కృష్ణా జిల్లా నందిగామలో పర్యటించినట్లు ఆమె తెలిపారు.
కృష్ణా జిల్లా నందిగామ శివారు అనాసాగరంలో జరిగిన ఒక శుభకార్యక్రమానికి హజరైన ఆమె.. తెలుగువాళ్లంతా ఒక్కటేనని పేర్కొన్నారు. ఆంధ్ర, తెలంగాణ భౌతికంగా రెండుగా విడిపోయినప్పటికీ రెండు రాష్ట్రాల్లో ఉన్న తెలుగువారందరం ఎప్పుడు ఒక్కటేనని వారందరూ పరస్పరం సోదర భావంతో కలిసి ఉండాలని ఆకాక్షించారు. ప్రపంచంలో తెలుగు సంస్కృతికి ఎంతో గొప్పదని కొనియాడారు. ప్రాంతాలు, కులాలు, మతాలు వేరైనా తెలుగువారంతా ఒక్కటేనన్నారు. ఐక్యంగా తెలుగు జాతి అభివృద్ది పాటు పడటంలో తాము కంకణబద్దులం అవుతామని చెప్పారు. నందిగామ ప్రాంతానికి మొదటిసారి వచ్చానని, ఈ ప్రాంత ప్రజలు తనపై ఎంతో అప్యాయత చూపించడం మరచిపోలేనని కవిత అన్నారు.