జి.ఎస్.టి. బిల్లు కోసం త్వరలో శాసనసభ సమావేశాలు: కెటిఆర్

ఈనెల 8వ తేదీన పార్లమెంటు ఆమోదం పొందిన జి.ఎస్.టి. బిల్లు చట్టరూపం దాల్చడానికి దేశంలో సగంకంటే ఎక్కువగా రాష్ట్రాలు ఆ బిల్లుని ఆమోదిస్తున్నట్లు శాసనసభలలో తీర్మానాలు చేసి కేంద్రానికి పంపవలసి ఉంటుంది. అప్పుడే దానిపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా ఆమోదముద్ర వేస్తారు. కనుక దేశంలో అన్ని రాష్ట్రాలకి  కేంద్ర ఆర్ధికమంత్రి జి.ఎస్.టి. బిల్లుకి మద్దతు తెలుపుతూ శాసనసభలో తీర్మానాలు చేసి పంపవలసిందిగా కోరుతూ లేఖలు వ్రాశారు. 

ఆంధ్రా, తెలంగాణా ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కెసిఆర్ లకి కూడా లేఖలు అందాయి. దానిపై మంత్రి కెటిఆర్ స్పందిస్తూ, త్వరలోనే శాసనసభ సమావేశాలు నిర్వహించి బిల్లుకి మద్దతుగా తీర్మానం చేసి పంపుతామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనిపై ఇంకా ఇంతవరకు స్పందించలేదు. తెదేపా కూడా జి.ఎస్.టి. బిల్లుకి మద్దతు తెలిపింది కనుక అది కూడా త్వరలోనే శాసనసభ ప్రత్యేక సమావేశాలు నిర్వహించవచ్చు. 


ఈ జి.ఎస్.టి. బిల్లు చట్ట రూపం దాల్చితే, వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి మొదలయ్యే నూతన ఆర్దిక సంవత్సరం నుంచి దేశవ్యాప్తంగా ఈ నూతన ఏకీకృత పన్ను విధానం అమలులోకి వస్తుంది. ఇంతవరకు వివిధ వస్తువులపై వివిధ రాష్ట్రాలలో వివిధ రకాలుగా పన్నులు వసూలు చేసేవారు. ఈ ఏకీకృత పన్నువిధానంలో అవేవీ ఉండవు. ఒకే ఒక పన్ను ఉంటుంది. అది ఎంత ఉండాలనే విషయాన్ని జి.ఎస్.టి. కౌన్సిల్ నిర్ణయిస్తుంది. 

ఈ విధానంలో మరో ప్రత్యేకత ఏమిటంటే, వస్తువులు ఉత్పత్తి అయ్యే చోట కాకుండా అవి అమ్మకం అయ్యే ప్రదేశంలోనే వాటిపై ఎంత పన్ను విధించాలనేది నిర్ణయించబడుతుంది. కనుక బారీ స్థాయిలో వివిధ ఉత్పత్తులు చేస్తున్న రాష్ట్రాలు ఆ ఆదాయం నష్టపోతాయి. అదేవిధంగా ఈ ఏకీకృత పన్ను విధానం అమలులోకి వస్తే రాష్ట్రాలు స్థానిక పన్నులు విదించుకొనే అధికారం కోల్పోతాయి కనుక దాని ద్వారా వచ్చే ఆదాయం కూడా కోల్పోతాయి. ఆ నష్టాన్ని వచ్చే ఐదేళ్ళ వరకు కేంద్రప్రభుత్వం భర్తీ చేస్తుంది. మొదటి మూడు సం.లు 100 శాతం, తరువాత సం.లో 75శాతం, చివరి సం.లో 50 శాతం నష్టం భర్తీ చేస్తుంది. ఈ ఏకీకృత పన్ను విధానంలో అనేక పన్నులు అన్ని తొలగిపోయి ఒకే ఒక పన్ను ఉంటుంది కనుక వస్తువుల ధరలు కూడా బారీగా తగ్గే అవకాశం ఉంది.