తెలంగాణాలో జోనల్ వ్యవస్థ త్వరలో రద్దు?

సమైక్య రాష్ట్రంలో ఆంధ్రా, రాయలసీమ, తెలంగాణా మూడు ప్రాంతాలలో నివసించే ప్రజలందరికీ ఉద్యోగాలలో సమాన అవకాశాలు కల్పించాలనే ఉద్దేశ్యంతో 1973లో రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఆర్టికల్ 371 (డి) క్రింద రాష్ట్రంలో మొత్తం 7 జోన్లు ఏర్పాటు చేయబడ్డాయి. వాటిలో ఆంధ్రాలో మూడు జోన్లు, రాయలసీమలో ఒక జోన్, తెలంగాణాలో మూడు జోన్లు ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగి తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా అవతరించినందున, ఆ జోనల్ వ్యవస్థని రద్దు చేయాలని తెలంగాణా ప్రభుత్వం భావిస్తోంది. జోనల్ వ్యవస్థ స్థానంలో రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి క్యాడర్ నియామకాలు చేపడతామని తెలంగాణా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ చెప్పారు. ఆర్టికల్ 371 (డి) తో ముడిపడున్న జోనల్ వ్యవస్థని రద్దు చేస్తే న్యాయపరమైన చిక్కులు ఎదురవకుండా న్యాయనిపుణుల సలహాలను తీసుకొంటామని చెప్పారు. త్వరలో తెలంగాణాలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేయబోతున్నారు కనుక ఆ ప్రక్రియ పూర్తీ చేసిన తరువాత దీనిని అమలుచేయాలనుకొంటున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణా ప్రభుత్వం రాష్ట్ర, జిల్లా స్థాయి పద్దతిలో నియామకాలు చేపట్టడం మొదలుపెడితే, సహజంగానే తెలంగాణా స్థానికులకి దాని వలన లబ్ది కలుగుతుంది. ఉద్యోగాలలో వారికే ఎక్కువ ప్రాధాన్యత, అవకాశాలు లభిస్తాయి.