తెలంగాణా శాసనసభ స్పీకర్ కి సుప్రీం నోటీసులు?

తెలంగాణాలో కాంగ్రెస్, టిడిపి, వైసిపిలకి చెందిన చాలా మంది ఎమ్మెల్యేలు, ఒక వైసిపి ఎంపి అధికార టిఆర్ఎస్ పార్టీలోకి దూకేసిన సంగతి అందరికీ తెలిసిందే. వారందరూ నేటికీ తమ తమ మాతృ పార్టీల ఎమ్మెల్యేలుగానే కొనసాగుతున్నారు. వారిలో టిడిపి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రిగా కూడా ఉన్నారు. వారి చేత రాజీనామాలు చేయించి మళ్ళీ ఎన్నికలు జరిపించాలని లేదా వారందరిపై అనర్హత వేటు వేయాలని ఆ మూడు పార్టీల ప్రతినిధులు స్పీకర్ మధుసూదనాచారికి వినతి పత్రాలు ఇచ్చారు కానీ ఆయన వాటిపై ఇంతవరకు ఎటువంటి చర్య తీసుకోలేదు. పైగా ఆ మూడు పార్టీల ఎమ్మెల్యేల అభ్యర్ధన మేరకు ఆ మూడు పార్టీలని టిఆర్ఎస్ లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. స్పీకర్ నిర్ణయాన్ని తప్పుపడుతూ ఆ మూడు పార్టీలు హైకోర్టుకి వెళ్ళినప్పటికీ స్పీకర్ పరిధిలో ఉన్న ఆ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. దానిపై బుదవారం విచారణ చేపట్టిన స్వీకరించిన జస్టిస్ కురియన్ ధర్మాసనం స్పీకర్ మధుసూధనాచారితో బాటు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలందరికీ కూడా నోటీసులు జారీ చేసింది. అందరినీ మూడు వారాలలోగా సంజాయిషీ ఈయవలసిందిగా ఆదేశించింది.

మన రాజ్యాంగం ప్రకారం చట్టసభల పరిధిలో ఉన్న కొన్ని అంశాలలో న్యాయస్థానాలు కూడా జోక్యం చేసుకోకూడదు. అందుకే హైకోర్టు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకొనేందుకు నిరాకరించింది. అయితే ఉత్తరాఖండ్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు కారణంగా ప్రభుత్వం కూలిపోయి, రాజకీయ సంక్షోభం ఏర్పడినప్పుడు హైకోర్టు, సుప్రీం కోర్టు రెండూ కూడా జోక్యం చేసుకొన్నాయి. పార్టీ ఫిరాయించిన వారిపై స్పీకర్ అనర్హత వేటు వేయడాన్ని గట్టిగా సమర్ధించాయి. ఆ కారణంగా 9మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడింది. కానీ అక్కడ స్పీకర్ వారిపై అనర్హత వేటు వేసిన తరువాతనే న్యాయస్థానాలు జోక్యం చేసుకొని స్పీకర్ నిర్ణయాన్ని సమర్ధించాయి తప్ప స్వయంగా అనర్హత వేటు వేయలేదు. వేయమని లేదా వద్దని గానీ స్పీకర్ ని ఆదేశించలేదు.

కనుక ఇప్పుడు తెలంగాణా స్పీకర్ పరిధిలో ఉన్న ఈ వ్యవహారంపై సుప్రీం కోర్టు సంజాయిషీ కోరవచ్చు కానీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటువేయమని ఆదేశించకపోవచ్చు.

స్పీకర్ అధికార పార్టీకి చెందినప్పటికీ, నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. కానీ రెండు తెలుగు రాష్ట్రాలలో స్పీకర్లు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ, తమతమ పార్టీలలో చేరిన ప్రతిపక్షాల ఎమ్మెల్యేలపై ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా వారిపై అనర్హత వేటు వేయకుండా కాపాడుతున్నారు. ఇది అప్రజాస్వామికం, అనైతికం అని వారికీ తెలుసు కానీ రాజ్యాంగపరంగా తమకున్న విచక్షణాధికారాలతో అధికార పార్టీలకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఫిరాయింపుల చట్టాలకి మళ్ళీ సవరింపులు చేసి ఈ లోపాలని సరిదిద్దితే కానీ ఈ సమస్యకి శాశ్విత పరిష్కారం లభించదు.