కోదండరాం ఫోన్ ట్యాపింగ్ చేయవలసిన అవసరం ఏమిటి?

తెలంగాణలో అందరూ గౌరవించే వ్యక్తి ప్రొఫెసర్ కోదండరాం. అటువంటి వ్యక్తిపై తెలంగాణ ప్రభుత్వం నిఘా పెట్టి ఆయన ఫోన్ ట్యాపింగ్ చేస్తే ప్రజలకి ఎటువంటి సంకేతాలు వెళతాయి? ప్రజలు ఏమనుకొంటారు? అని టిఆర్ఎస్ ప్రభుత్వం ఆలోచిందో లేదో తెలియదు. తనతో సహా తెలంగాణ రాజకీయ జేఏసి నేతలపై కూడా ప్రభుత్వం నిఘా పెట్టిందని చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం స్వయంగా మరోమారు ఆరోపించారు. అందుకు ఆయన ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమపై నిఘా పెట్టవలసిన అవసరం ఏమిటి? అని నిలదీశారు. తామేమీ చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేయడంలేదని, అసాంఘిక శక్తులమో తీవ్రవాదులమో కాదని, ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నామని అన్నారు. తమ కార్యక్రమాలన్నీ బహిరంగంగానే నిర్వహిస్తుంటామని వాటి గురించి ఏదైనా సమాచారం కావాలనుకొంటే అడిగితే తామే ప్రభుత్వానికి అందించేవారమని కోదండరాం అన్నారు.       

తెదేపా నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి కూడా అందుకు టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని తప్పు పట్టారు. అది అభద్రతా భావంతో బాధపడుతున్నందునే ఇటువంటి అప్రజాస్వామికమైన పనులకి పాల్పడుతోందని విమర్శించారు. ఇతర పార్టీల నేతలని, ప్రజా ప్రతినిధులని టిఆర్ఎస్ పార్టీలోకి భారీ సంఖ్యలో రప్పించుకోవడం వలన ఆ పార్టీలో అంతర్గతంగా తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంటే అది సహజమే. 

ఇక తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వివిధ ప్రాజెక్టులలో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు, వాటి కోసం ప్రభుత్వం చేపట్టిన భూసేకరణ, రుణమాఫీ వంటి హామీల అమలులో వైఫల్యం వంటి అనేక కారణాల చేత కారణంగా ప్రజలలో వ్యతిరేకత పెరుగుతున్నట్లు టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా గ్రహించినందునే అది అభద్రతా భావంతో బాధపడుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే తనకి సవాలు విసురుతున్న తెలంగాణ రాజకీయ జేఏసి నేతలు, వారి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంని నియంత్రించేందుకు వారిపై నిఘా పెట్టి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు.