ఆదిలాబాద్ లో టీ-కాంగ్రెస్ సభ విజయవంతం..దేనికి సంకేతం?

టీ-కాంగ్రెస్ పార్టీ రైతు గర్జన సభ పేరిట మంగళవారం ఆదిలాబాద్ లో ఒక భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఆ సభకి ముఖ్య అతిధిగా హాజరైన దిగ్విజయ్ సింగ్ తో సహా సభలో ప్రసంగించిన వారంతా టిఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. సాగునీటి ప్రాజెక్టులలో అక్రమాలు, అవినీతి, రుణమాఫీ హామీని అమలుచేయకపోవడం, ముస్లింలకి, దళితులకి రిజర్వేషన్లు అమలు, దళితులకి మూడెకరాల భూమి, పేదలకి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు వంటి అంశాలపై తెలంగాణ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీశారు. దిగ్విజయ్ సింగ్ ముఖ్యమంత్రి కెసిఆర్ తో పాటు, ప్రధాని నరేంద్ర మోడీని కూడా కడిగి పడేశారు. “వారు ఇద్దరూ  ...అబద్ధాలు చెప్పే అధికారంలోకి వచ్చారు. అబద్ధాలతోనే ప్రజలని మోసం చేస్తూ పరిపాలన సాగిస్తున్నారని” దిగ్విజయ్ విమర్శలు గుప్పించారు.

ఇక ఆ సభకి హాజరైన భారీ జనాలని చూసి పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా సంతోష పడిపోతూ, తమ సభకి వచ్చిన జనాలని చూసి టిఆర్ఎస్ ప్రభుత్వం గుండెల్లో రైళ్ళు పరిగెడుతాయని అన్నారు. ఆయన కూడా టిఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు గుప్పించిన తరువాత ఇక దానికి రోజులు దగ్గర పడ్డాయని జోస్యం చెప్పారు.    

తమ సభకి ఊహించినదానికంటే చాలా ఎక్కువ గానే రైతులు, ప్రజలు హాజరవడం చూసి టీ-కాంగ్రెస్ నేతలు సంతోష పడటం సహజమే. తమ పార్టీకి రాష్ట్రంలో మళ్ళీ పూర్వ వైభవం సాధించడం కుదురుతుందనే భావన వారిలో కనిపించింది. అయితే అటువంటి సభలకి ప్రజలు స్వచ్చంధంగా తరలివచ్చి ఉంటే, వారు ఆ విధంగా ఆనందించినా, ఊహించుకొన్నా అర్ధం ఉంటుంది. కానీ, ఈ సభని చాలా ప్రతిష్టాత్మకంగా భావించి దానిని విజయవంతం చేయడం కోసం టీ-కాంగ్రెస్ నేతలందరూ రేయింబవళ్ళు శ్రమించి జనసమీకరణ చేశారు. తత్ఫలితంగానే రైతు గర్జన సభ జనాలతో కళకళలాడిందని చెప్పవచ్చు.

ఆ జనసందోహాన్ని చూసి టీ-కాంగ్రెస్ నేతలు సంతోషపడితే ఎవరూ కాదనరు. కానీ తమ సభకి హాజరయిన ప్రజలందరూ స్వచ్చంధంగా వచ్చారా లేకపోతే జనసమీకరణలో భాగంగా తరలివచ్చారా? వారందరూ తమ పార్టీ అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నారా.. లేదా? తమ సభకి హాజరయిన వారు అందరూ టిఆర్ఎస్ పాలనని వ్యతిరేకిస్తున్నారా లేదా? అనే మూడు ప్రశ్నలపై అక్కడే అభిప్రాయ సేకరణ చేసి ఉంటే తమ సభ విజయవంతం అయ్యిందో లేదో కాంగ్రెస్ పార్టీ నేతలకే తెలిసి ఉండేది.

టీ-కాంగ్రెస్ నేతలు జనసమీకరణ చేశారా లేదా అనే విషయాన్ని పక్కనబెడితే, నేటికీ వారి సత్తా, తెలంగాణ ప్రజలపై వారికున్న పట్టు ఏమాత్రం కోల్పోలేదని ఈ సభ కళ్ళకి కట్టినట్లు చూపించింది. కనుక టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా దీనిని ఒక హెచ్చరికగా స్వీకరించడం మంచిది.