తెలుగు రాష్ట్రాలలో పోలీసు అధికారుల ఆత్మహత్యలు అధికమవుతున్నాయి. గతంలో కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ స్థాయి పోలీసు సిబ్బంది ఉన్నతాధికారుల వేధింపులు భరించలేక అత్మహత్యలకు పాల్పడిన ఘటనలు నమోదు కాగా, ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు ఎస్ఐ లతో పాటు స్టేషన్ హౌజ్ అధికారుల వరకు చేరాయి. తాజాగా మెదక్ జిల్లా కుకునూరుపల్లిలో ఎస్ఐ రామకృష్ణారెడ్డి (45) ఆత్మహత్య కలకలం రేపింది. పోలీస్ క్వార్టర్స్‌లో తన సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకుని ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది.
సంఘటనా స్థలంలో సూసైడ్ నోట్ లభ్యమైంది. ఉన్నతాధికారుల వేధింపులు తాళలేక తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఎస్ఐ సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. తాను ఉద్యోగం మానేస్తానని క్రితం రోజు రాత్రి భార్యకు రామకృష్ణారెడ్డి ఫోన్ చేసినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఉన్నతాధికారుల వేధింపులే తన భర్త మృతికి కారణమని ఆయన భార్య ఆరోపిస్తున్నారు. ఎస్ఐ రామకృష్ణారెడ్డిది నల్లగొండ జిల్లా, మఠంపల్లి మండలం బక్కమంత్రగూడెం స్వస్థలం, ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఎస్ఐ మృతదేహాన్ని గజ్వేల్ ఏరియా ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.