ప్రధాని నరేంద్ర మోడీ గజ్వేల్ సభలో కెసిఆర్ ప్రభుత్వాన్ని పొగడటం, అదే విధంగా కెసిఆర్ మోడీని, ఆయన ప్రభుత్వాన్ని పొగడటంతో ఆ రెండు పార్టీలు దగ్గరవుతున్నాయని ఊహాగానాలు మొదలయ్యాయి. కానీ ఆ తరువాత రాష్ట్ర బిజెపి నేతలు టిఆర్ఎస్ ప్రభుత్వాపైనే కాకుండా, ముఖ్యమంత్రి కెసిఆర్ పై కూడా విమర్శలు గుప్పిస్తుండటంతో, బిజెపికి టిఆర్ఎస్ పట్ల స్పష్టమైన వైఖరి లేదని, చాలా అయోమయంలో ఉందనే విమర్శలు వినిపించాయి. ఆ విమర్శలకి జవాబిస్తున్నట్లుగా బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు మోడీ మాటలకి బాష్యం చెప్పారు.
“మోడీ మిషన్ భగీరథ ప్రారంభోత్సవానికి వచ్చారంటే దానర్ధం టిఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులలో అవినీతికి క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చేసినట్లు కాదు. మిషన్ భగీరథ పధకాన్ని మోడీ ప్రారంభోత్సవం చేసినప్పటికీ, అందులో అవినీతి ఉంటే దానిని గట్టిగా మేము వ్యతిరేకిస్తాము. మోడీ ఫెడరల్ స్ఫూర్తిని ప్రదర్శించారు అంతే. దేశంలో ఏ రాష్ట్రం మంచి పనులు చేపట్టినా వాటిని ప్రోత్సహించడం చాలా మంచి విషయం. మోడీ అదే చేశారు. రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వం స్నేహపూర్వకంగా ఉంటుందని మోడీ స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు తప్ప టిఆర్ఎస్ పార్టీతో దోస్తీ చేస్తామని కాదు," అని మురళీధర్ రావు అన్నారు.
“తెలంగాణలో బిజెపికి ఉజ్వల భవిష్యత్ ఉందని మోడీ హైదరాబాద్ సభలో చెప్పారు. మా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా అదే చెప్పారు. రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వానికి బిజెపియే సరైన ప్రత్యామ్నాయమని మేము భావిస్తున్నాము. టిఆర్ఎస్ ప్రభుత్వం పట్ల మాకు చాలా స్పష్టమైన వైఖరి ఉంది. దానికి ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేదు. ప్రతిపక్షాలు అంటే ఖాతరు లేదు. అదొక నిరంకుశ, అవినీతి ప్రభుత్వం. దానిని గద్దె దించవలసిన అవసరం ఉంది. కనుక టిఆర్ఎస్ తో మేము పొత్తులు పెట్టుకొనే ప్రసక్తే లేదు. వచ్చే ఎన్నికలలో దానికీ మాకు మధ్యనే ప్రధాన పోటీ ఉంటుంది,” అని రావు అనడం కొసమెరుపు.
టిఆర్ఎస్ పట్ల బిజెపి నేతలలో అయోమయం నెలకొని ఉంది కనుక మురళీధర్ రావు దానిని క్లియర్ చేశారనుకోవచ్చు. కానీ ఆయన చెపుతున్నట్లుగా వచ్చే ఎన్నికలలో బిజెపి టిఆర్ఎస్ ని ఢీకొని ఓడించగలదా? దానికోసం రాష్ట్ర బిజెపిలో బలమైన నేతలున్నారా? అసలు అన్ని నియోజకవర్గాలలో నిలబెట్టేందుకు బిజెపి వద్ద బలమైన అభ్యర్ధులు ఉన్నారా? లేకపోతే ఏమి చేయాలో ఇప్పటి నుంచే ఆలోచించుకొంటే మంచిది కదా!