స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గవర్నర్ నరసింహన్ నిన్న ఇచ్చిన విందుకి ముఖ్యమంత్రులు, చంద్రబాబు, కెసిఆర్, వారి మంత్రులు హాజరయ్యారు. కానీ వారిద్దరి కంటే అందరి దృష్టిని ఎక్కువ ఆకర్షించింది మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డేనని చెప్పక తప్పదు. ఒకవేళ ఆ విందుకు జగన్ హాజరు కాకపోయుంటే అప్పుడు అందరి దృష్టి ఇద్దరు ముఖ్యమంత్రులపైనే కేంద్రీకృతం అయ్యుండేది. రాజకీయంగా చూసినట్లయితే వారు ముగ్గురూ కూడా శత్రువులే. ఈ విందు కార్యక్రమానికి ముందు కొద్ది సేపు గవర్నర్ నరసింహన్ ఇద్దరు ముఖ్యమంత్రులతో సెపరేట్ గా మాట్లాడినట్లు సమాచారం. గవర్నర్ కి చెరో పక్క కూర్చొని ఆయన చెప్పే మాటలని వింటూ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కాలక్షేపం చేశారు.
అయితే ఈ విందులో వారికి జగన్మోహన్ రెడ్డి షేక్ హ్యాండ్స్ ఇవ్వడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాజకీయంగా వారిద్దరూ బద్ద శత్రువులే అయినప్పటికీ, చంద్రబాబు నాయుడు కొంచెం ఎక్కువ శత్రువు కనుక ఆయనకి షేక్ హ్యాండ్ ఇస్తున్నప్పుడు ఆమడదూరం నుంచి ఏదో తప్పనిసరి మొక్కుబడి తంతు అన్నట్లు జగన్ షేక్ హ్యాండ్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు నేరుగా జగన్ కళ్ళలోకి చూస్తూనే షేక్ హ్యాండ్ ఇచ్చారు కానీ జగన్ ‘ఐ-కాంటాక్ట్’ కూడా లేకుండా ఫోటోగ్రాఫ్ ల కోసమే అన్నట్లుగా ఆ తంతు ముగించారు.
కానీ కెసిఆర్ తో జగన్మోహన్ రెడ్డికి ఏదో తెలియని అనుబంధం ఉంది కనుక రెండు చేతులతో ఆయన చేతులు బలంగా పట్టుకొని కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ చాలా పద్దతిగా షేక్ హ్యాండ్ ఇచ్చారు. కెసిఆర్ ఏమనుకాకోకుంటే ఆయనని వాటేసుకొని ఉండేవారేమో కూడా. కెసిఆర్ చేతులు గట్టిగా పట్టుకొని షేక్ ఇవ్వడం ద్వారా తెరాసతో తనకి మంచి అనుబంధమే ఉందని లేదా ఉండాలని అది ఎప్పటికీ కొనగాలని కోరుకొంటున్నట్లు చాటుకొన్నట్లయింది.
జగన్ షేక్ హ్యాండ్స్, బాడీ లాంగ్వేజ్ రెండూ కూడా ఆయన మనోభావాలకి చక్కగానే అద్దం పట్టి చూపాయి. కానీ అవి ఆయన రాజకీయ అపరిపక్వతని కూడా చూపాయి. ఇటువంటి విషయాలలో ఆయన చంద్రబాబు, కెసిఆర్ ల ని చూసి చాలా నేర్చుకోవలసి ఉందని అర్ధం అవుతోంది. వారిద్దరూ ఒకరినొకరు ఎంతగా ద్వేషించుకొంటారో అందరికీ తెలుసు. కానీ ఇటువంటి సందర్భాలలో వారు తమ మధ్య గొడవలేవీ లేవన్నట్లుగా ఆప్యాయంగా నవ్వుతూ పలకరించుకొంటారు, షేక్ హ్యాండ్స్ ఇచ్చుకొంటారు. అవసరమయితే కప్పు కాఫీ..నాలుగు మాటలు కూడా చక్కగా చెప్పుకోగలరు. కానీ జగన్ తన మనసులో చంద్రబాబు పట్ల ద్వేషాన్ని, కెసిఆర్ పట్ల అభిమానాన్ని చిన్న షేక్ హ్యాండ్స్ తోనే బయటపెట్టుకొన్నారు. రాజకీయాలలో ఎదగదలిచినవారు తమ అంతరంగాన్ని అవసరమైనప్పుడే బయటపెట్టుకోవాలి తప్ప ఇటువంటి చోట్ల కాదు.