ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు నిన్న తన కుటుంబ సభ్యులతో కలిసి వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామిని దర్శించుకొన్నారు. ఆ తరువాత ముఖ్యమంత్రి కెసిఆర్ పై పొగడ్తల వర్షం కురిపించారు. స్వర్గీయ ఎన్టీఆర్ తరువాత ప్రజలకోసం పరితపించే ముఖ్యమంత్రి ఒక్క కెసిఆర్ మాత్రమేనని అన్నారు. ఆయన రాజకీయాలకి అతీతంగా ప్రజలకి, రాష్ట్రానికి మేలు చేసే పనులు చాలా చేస్తున్నారని అందుకు ఆయనని మనసారా అభినందిస్తున్నానని అన్నారు. శ్రీరాజరాజేశ్వరస్వామి వారి ఆలయాన్ని అభివృద్ధి చేయడం కోసం కెసిఆర్ ఏకంగా రూ.400 కోట్లు మంజూరు చేయడం చాలా గొప్ప విషయమని మెచ్చుకుంటూ, ఎప్పుడూ ప్రజల కోసమే పరితపించేటటువంటి ముఖ్యమంత్రి దొరకడం తెలంగాణ ప్రజల అదృష్టమని మోహన్ బాబు మెచ్చుకొన్నారు. 13 ఏళ్ల క్రితం ఈ ఆలయానికి వచ్చానని, అప్పటికీ ఇప్పటికీ పోల్చి చూస్తే చాలా అభివృద్ధి జరిగిందని మోహన్ బాబు అభిప్రాయం పడ్డారు.
మోహన్ బాబు మాటలలో అతిశయోక్తి ఏమీ లేకపోయినప్పటికీ, తెలుగు సినిమా హీరోలు, సినీ ప్రముఖులు అందరూ కూడా గత రెండేళ్లుగా కెసిఆర్ భజన చేస్తూనే ఉన్నారు. దానర్ధం వారందరికీ ఆయన అంటే అభిమానమో, గౌరవమో లేదా మరొకటో అనుకోనవసరం లేదు. తెలుగు సినీ పరిశ్రమ, దానిలో పనిచేస్తున్న వారు, దానిని శాసిస్తున్నవారు అందరూ హైదరాబాద్ లోనే స్థిరపడ్డారు. వారిలో చాలా మంది ఆంధ్రా మూలాలు ఉన్నవారే. వారి విలువైన ఆస్తిపాస్తులు, స్టూడియోలు, థియేటర్లు, వ్యాపారాలు వగైరా అన్నీ హైదరాబాద్, తెలంగాణలోనే ఉన్నాయి. తెలంగాణ ఉద్యమాల సమయంలోనే వారు తెరాస దెబ్బ రుచి చూసి ఉన్నారు. రాష్ట్ర విభజన తరువాత కూడా వారు ప్రభుత్వం నుంచి కొన్ని సమస్యలు, సవాళ్ళు ఎదుర్కొన్నారు.
ఆ కారణంగా ఆంధ్రకి తరలిపోదామనే ఆలోచన కూడా చేశారు. కానీ అది చాలా భారీ ఖర్చుతో కూడుకొన్న పని కనుక వారు హైదరాబాద్ లోనే ఉండిపోయారు. ఆ తరువాత తెరాస ప్రభుత్వం కూడా తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్ లో ఉండటం వలన కలిగే ప్రయోజనాలని గుర్తించి వారి పట్ల మృదువుగా వ్యవహరించడం ఆరంభించింది. అప్పటి నుంచే తెలుగు సినీ హీరోలు, సినీ ప్రముఖులు ఏదో సందర్భం చూసుకొని ముఖ్యమంత్రి కెసిఆర్ దర్శనం చేసుకోవడమో లేదా ఈ విధంగా పొగడటమో చేస్తుంటారు. మోహన్ బాబు కూడా అందుకే పొగిడి ఉండవచ్చు లేదా మనస్పూర్తిగా కూడా అని ఉండవచ్చు.