భూసేకరణకి హైకోర్టు లైన్ క్లియర్..పాపం రైతులే...

తెలంగాణ ప్రభుత్వం జీవో:123పై రెండుసార్లు హైకోర్టులో ఎదురుదెబ్బలు తిన్నప్పటికీ, కోర్టు సూచించిన ప్రకారం పాత జీవోలో లోటుపాట్లని, సాంకేతిక సమస్యలని సవరించి తాజాగా జీవో:190ని జారీ చేయడంతో హైకోర్టు భూసేకరణకి అనుమతించింది. ఇది తెలంగాణ ప్రభుత్వానికి చాలా ఊరట కలిగించే విషయమే. ఇకపై భూములు కోల్పోయిన రైతులు తప్ప రాజకీయ నాయకులు ఎవరూ పిటిషన్లు వేసినా విచారణకి స్వీకరించమని హైకోర్టు తేల్చి చెప్పేసింది. అయితే రైతుల దగ్గర నుంచి బలవంతంగా భూములు గుంజుకొన్నా, సాగులో ఉన్న భూములని సేకరించినా ఉపేక్షించబోమని హైకోర్టు ప్రభుత్వాన్ని హెచ్చరించింది. రైతులు తమ ఇష్టపూర్వకంగా భూములు ఇస్తేనే వారికి కొత్త జీవోలో పేర్కొన్న విధంగా తగిన నష్టపరిహారం అందించి భూములు తీసుకోవాలని సూచించింది.

హైకోర్టు సూచన చట్ట ప్రకారం చూస్తే బాగానే ఉంది. కానీ ఏదైనా ఒక ప్రాజెక్టు నిర్మాణం కోసం దానికి తగిన, అవసరమైన భూములని గుర్తించి భూసేకరణకి ప్రభుత్వం పూనుకొన్నప్పుడు, హైకోర్టు విధించిన ఈ షరతుల ప్రకారమే భూసేకరణ చేయడం సాధ్యమేనా? మధ్యలో కొన్ని సాగుభూములు ఉన్నట్లయితే వాటిని వదిలి, రైతులు ఎంత భూమి ఇస్తే అంతే భూమిలో ప్రాజెక్టు నిర్మించడం సాధ్యమేనా అంటే కాదనే అర్ధం అవుతుంది. కనుక రైతులు ఇష్టపడకపోయినా వారికి నయానో భయానో నచ్చజెప్పి భూసేకరణ చేయక తప్పదు. రైతులు తరపున న్యాయస్థానంలో పోరాడటానికి ప్రతిపక్షాలు సిద్ధమైనప్పటికీ వారి పిటిషన్లను అనుమతించబోమని హైకోర్టు స్పష్టం చేసింది. కనుక రైతులే పోరాడవలసి ఉంటుంది. వారికి ఆ అవకాశం ఉన్నప్పటికీ పేదరికం కారణంగా ప్రభుత్వంతో పోరాడలేరు. వారి తరపున ప్రతిపక్షాలు ప్రభుత్వంతో పోరాడుతామని గొప్పలు చెప్పుకొంటున్నప్పటికీ వారి మాటలు నమ్మలేము. ఎందుకంటే రైతుల సమస్యపై ఆసక్తి కోల్పోయినా లేదా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు ఇంతకంటే పెద్ద సమస్య మరొకటి దొరికినా వెంటనే షిఫ్ట్ అయిపోవడం ఖాయం కాబట్టి. కనుక రైతుల సంక్షేమం, పునరావాస బాధ్యతలు రాష్ట్ర ప్రభుత్వమే స్వీకరించవలసి ఉంటుంది. లేకుంటే రైతులు అన్యాయం అయిపోతారు.