సంక్షేమంలో దేశంలోనే నెంబర్ వన్ తెలంగాణ

తెలంగాణ ప్రభుత్వం 70వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను గోల్కొండ కోటలో ఘనంగా నిర్వహించింది. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక మూడోసారి వేడుకలను కూడా గోల్కొండలోనే జరుపుకుంటున్నందుకు ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళుతున్నామన్నారు.

బీసీలు, ఈబీసీలకు కల్యాణలక్ష్మి పథకం వర్తింపు చేస్తున్నట్లు చెప్పారు. సంక్షేమ రంగంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉందని కేసీఆర్ పేర్కొన్నారు. పోరుగు రాష్ట్రాలతో సంబంధాలను చక్కగా ఏర్పర్చుకోవడంతో రాష్ట్రానికి ఎదురైన పలు సమస్యలను కూడా చక్కబెట్టుకోగలిగామన్నారు. ముఖ్యంగా విద్యత్ సమస్యను ఆయన ప్రస్తావించారు. ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా మిషన్ భగీరధ పథకాన్ని ప్రారంభించడంతో పాటు.. ధర్మల్ విద్యుత్ పవర్ ప్లాంట్ కూడా శంఖుస్థాపన చేశామని వాటిని పూర్తి వినియోగంలోకి తీసుకు వచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని కృషిని కూడా ప్రశంసించారు

కేజీ నుంచి పీజీ వరకూ ఉచిత విద్యకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. నాలుగు నెలల్లో ఛత్తీస్ గఢ్ నుంచి వెయ్యి మెగావాట్ల విద్యుత్ ను పొందుతామన్నారు. పేద బ్రాహ్మణులకు బడ్జెట్ లో వంద కోట్లు కేటాయించినట్లు చెప్పారు. దసరా పండుగకు కొత్త జిల్లాల ఏర్పాటు ఉంటుందన్నారు. చిన్న, సన్నకారు రైతులకు 100 శాతం సబ్సిడీ, ఎస్టీ, మైనార్టీలకు త్వరలో 12శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు. 2019 నాటికి మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి తాగు నీరు దిస్తామన్నారు. ఈ ఏడాది ప్రభుత్వ పరిధిలో లక్ష ఉద్యోగాల భర్తీ చేస్తామన్నారు. 2303 పరిశ్రమల ద్వారా రాష్ట్రానికి రూ.46వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు.