కేసీఆర్‌పై దేశద్రోహం చేశారు: బండి సంజయ్‌ కుమార్‌

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం శాసనసభలో తీర్మానం చేసి ఆమోదించడాన్ని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్ తప్పు పట్టారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, “పార్లమెంటు చేసిన చట్టాన్ని వ్యతిరేకించడమంటే దేశ ద్రోహమే అవుతుంది. కనుక సీఏఏకు వ్యతిరేకంగా శాసనసభలో తీర్మానం చేయించిన  సిఎం కేసీఆర్‌పై దేశద్రోహ నేరం కింద కేసు నమోదు చేయాల్సి ఉంది. పార్లమెంటు చేసిన చట్టాన్ని వ్యతిరేకిస్తూ చేసిన ఆ తీర్మానం చిత్తుకాగితంతో సమానం. అయినా పౌరసత్వం కల్పించడానికే సీఏఏను తెచ్చాము తప్ప ఉన్న పౌరసత్వం తొలగించడానికి కాదు. పౌరసత్వం అంశంపై కేవలం పార్లమెంటు మాత్రమే నిర్ణయం తీసుకోగలదు తప్ప శాసనసభలు కావని సిఎం కేసీఆర్‌కు తెలియదా? అదే సాధ్యమైతే టిఆర్ఎస్‌ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు ఎదుర్కొంటున్న పౌరసత్వ సమస్యపై శాసనసభలో తీర్మానం చేసి పరిష్కరించగలరా? పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్‌లలో మైనార్టీ వర్గాలపై దాడులు జరుగుతున్నాయి. ఆ కారణంగా ఆ దేశాల నుంచి శరణు కోరి వచ్చినవారికి మానవతా దృక్పదంతో భారతీయ పౌరసత్వం కల్పించడానికే కేంద్రప్రభుత్వం సీఏఏను తెచ్చింది తప్ప దేశంలో ఏదో ఓ వర్గంవారిని బయటకు పంపించడానికి కాదు. కనుక రాష్ట్రాలలో అధికారంలో ఉన్నవారు ఈ విషయంలో కేంద్రానికి సహకరిస్తే మంచిది,” అని అన్నారు.