మావోయిస్టుగా మారి వారిపైనే తిరుగుబాటు బావుటా ఎగురవేసి పోలీసులకు లొంగిపోయిన నయీముద్దీన్.. కోవర్టుగా మారి చివరకు పోలీసులతోనే కలసి ఎదిగిన గ్యాంగ్ స్టర్ వారికే సవాల్ విసిరి.. వారి ఎన్ కౌంటర్ లోనే హతమయ్యాడు. కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు బయటకొస్తున్నాయి. నయీమ్ కేసును ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు దర్యాప్తు చేస్తుండటంతో అనేక మంది పోలీసు అధికారులకు, మాజీ అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించే ఘడియలు మొదలయ్యాయి. అందుకు నయీమ్ డైరీలే దోహదం చేస్తున్నాయి.
ఈ కేసు విచారణకు సంబంధించి విజయవాడకు చెందిన రిటైర్డ్ పోలీసు అధికారిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నయీంకు గతంలో కొన్ని కేసుల్లో సదరు అధికారి సహకరించినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. నయీం డైరీలో నుంచి సేకరించిన సమాచారంతో ఆ రిటైర్ అయిన అధికారిని సిట్ బృందం విచారిస్తోంది. మరోపక్క, నయీం డ్రైవర్ శామ్యూల్స్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం జిల్లా చర్ల నుంచి అతడు చత్తీస్ ఘఢ్ వెళ్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. శామ్యూల్ నుంచి 9 ఎంఎం పిస్టల్ స్వాధీనం చేసుకున్నారు.
ఇక నయీంకు సంబంధించి మరో ఆస్తి బయటపడింది. పుప్పాలగూడలో నయీంకు సంబంధించిన మరో ఇల్లును పోలీసులు ఆదివారం గుర్తించారు. అల్కాపూర్ ఇంటికి కిలోమీటర్ దూరంలో నాలుగు అంతస్తుల్లో ఈ ఇల్లు నిర్మించి ఉంది. విలాసవంతమైన ఈ ఇంట్లో పోలీసుల సోదాలు నిర్వహించారు. భారీగా డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే,.. నయీం నేరాలు ఆంధ్రప్రదేశ్ లో లేవని డీజీపీ సాంబశివరావు అన్నారు. ఏపీలో నయీం కేసు విషయం సిట్ అవసరం లేదని, తెలంగాణ దర్యాప్తునకు పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు.