పిసిసి అధ్యక్ష పదవి నాకే ఇవ్వండి: కోమటిరెడ్డి

భువనగిరి కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గురువారం డిల్లీలో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసి తాను విద్యార్ది దశ నుంచితాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని కనుక తనకే పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వాలని అభ్యర్ధించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల గురించి ఆయన సోనియా గాంధీకి వివరించి టిఆర్ఎస్‌ను ఎదుర్కొని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేగలనని ఆయన సోనియా గాంధీకి భరోసా ఇచ్చినట్లు సమాచారం. మునిసిపల్ ఎన్నికల తరువాత ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్వయంగా పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకొంటానని అన్నారని అందుకే తాను ఆ పదవిని ఆశిస్తున్నానని తెలిపారు. పార్టీ అధ్యక్ష పదవి ఆశిస్తున్న రేవంత్‌ రెడ్డి ప్రస్తావన చర్చకు  రాలేదని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. 

ఫిరాయింపుల కారణంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనపడి ఉన్నప్పటికీ, కనీసం అరడజను మంది రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు అధ్యక్ష పదవికి పోటీ పడుతుండటం విశేషమే. కానీ జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి చేపట్టేందుకు పార్టీలో ఎవరూ ముందుకు రాకపోవడం విచిత్రం.