స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ఇవాళ గోల్కొండ కోటపై జాతీయ జెండా ఆవిష్కరించారు. తరువాత రాష్ట్ర ప్రజలని ఉద్దేశ్యించి మాట్లాడుతూ తమ ప్రభుత్వం ప్రధానంగా నీటిపారుదల, విద్యుత్ సరఫరా, ఉద్యోగ ఉపాధి, మౌలిక వసతుల కల్పనపై దృష్టి కేంద్రీకరించి చాలా చిత్తశుద్ధితో పనిచేస్తోందని చెప్పారు. ఈ రెండేళ్ళ వ్యవధిలోనే తెలంగాణ సంక్షేమ రంగాలలో చాలా అభివృద్ధి సాధించిందని, కేంద్ర ప్రభుత్వంతో సహా దేశంలో అన్ని రాష్ట్రాలు కూడా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని గుర్తిస్తున్నాయని చెప్పారు. తమ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలతో, విద్యుత్ సరఫరా కోసం ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంతో ఒప్పందాలు కుదుర్చుకొందని అన్నారు.
ఇరుగుపొరుగు రాష్ట్రాలతో తమ ప్రభుత్వం సత్సంబంధాలే కోరుకొంటోందని అన్నారు. ఛత్తీస్ ఘడ్ నుంచి మరొక నాలుగు నెలలో తెలంగాణ కి 1,000 మెగా వాట్స్ విద్యుత్ సరఫరా అవుతుందని ముఖ్యమంత్రి చెప్పారు. కోటి ఎకరాలకి నీళ్ళు అందివ్వడమే లక్ష్యంగా పెట్టుకొని తమ ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. తమ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పధకాల గురించి ముఖ్యమంత్రి కెసిఆర్ వివరించి వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రం చాలా అభివృద్ధి సాధిస్తుందని ప్రజలకి గట్టి భరోసా కల్పించారు.