ఆగస్ట్ 15 అంటే భారత్ కి స్వాతంత్ర్యం వచ్చిన రోజు. అదే రోజున మంత్రి హరీష్ రావు ఆస్ట్రేలియాకి బయలుదేరబోతున్నారు. అంటే మల్లన్నసాగర్ ప్రాజెక్టు భూసేకరణ గొడవల నుంచి ఆయనకి విముక్తి లభించినట్లేనా? అనే సందేహం కలుగుతోంది. ఆయన కొన్ని రోజుల క్రితమే విదేశీ పర్యటనకి వెళ్ళవలసి ఉంది. కానీ మల్లన్నసాగర్ పై ప్రతిపక్షాలు చాలా రభస చేస్తుండటం, టిఆర్ఎస్ ప్రభుత్వం తరపున ఎవరూ ఆయనకి అండగా వచ్చి నిలబడకపోవడంతో ఆయన తన విదేశీ ప్రయాణాన్ని రద్దు చేసుకొని ఒంటరిపోరాటం చేయవలసి వచ్చింది. ఒకవేళ ఆ సమయంలో ముందు అనుకొన్న ప్రకారం విదేశీయాత్రకి బయలుదేరిపోయుంటే, మల్లన్నసాగర్ ప్రాజెక్టుపై ప్రతిపక్షాలు చేస్తున్న గొడవ కారణంగా తిరిగి వచ్చేసరికి ఆయన తన మంత్రి పదవిని కోల్పోయుండేవారేమో?
ప్రతిపక్షాల హడావుడి ముగిసిన తరువాత సీన్ హైకోర్టుకి మారింది. జీవో:123 వ్యవహరం హైకోర్టుకి చేరడంతో ఆయన సమస్యగా భావిస్తున్న భూసేకరణ సమస్య ప్రభుత్వ సమస్యగా మారిపోయింది. అంతవరకు ఆయననే టార్గెట్ చేసుకొని పోరాడుతున్న ప్రతిపక్షాలు తెలంగాణ ప్రభుత్వంపైకి మళ్ళాయి. దానితో ఆయనకి ఊపిరి తీసుకొనేందుకు కొంత సమయం చిక్కినట్లయింది. ప్రస్తుతం ఆ అంశం హైకోర్టులో ఉంది. హైకోర్టు ఆదేశానుసారం ఆ జీవోలో కొన్ని మార్పులు చేర్పులు చేసి మళ్ళీ హైకోర్టుకి సమర్పిస్తే దానిపై మంగళవారం తీర్పు చెపుతుంది. జీవో:123కి హైకోర్టు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది కనుక ఇక ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసి అడుగకపోవచ్చు. కనుక పరిస్థితులు చాలా వరకు చక్కబడినట్లే కనిపిస్తున్నాయి. కనుక మంత్రి హరీష్ రావుకి కూడా ఈ సమస్యల నుంచి విముక్తి లభించినట్లే భావించవచ్చు. అందుకే ఇప్పుడు ఆయన నిశ్చింతగా విదేశీయాత్ర చేసుకొని రావచ్చు.
ఆయన ఆస్ట్రియాలో వివిధ ప్రాంతాలలో ఆరు రోజుల పాటు పర్యటిస్తారు. ఆ దేశంలో ఎత్తిపోతల పధకాలలో వినియోగిస్తున్న అత్యాధునికమైన పంపు సెట్లని పరిశీలించేందుకు ఆయన వెళుతున్నారు. ఒకవేళ నచ్చితే వాటిని కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ప్రభుత్వం ఆర్డర్ చేస్తుంది.