నయీంతో నాకు సంబంధం లేదు: మాజీ డిజిపి దినేష్ రెడ్డి

ఏదో సామెత చెప్పుకొన్నట్లుగా నయీం ఎన్ కౌంటర్ తరువాత మీడియాలో వస్తున్న వార్తలతో చాలా మంది రాజకీయ నాయకులు, పోలీస్ ఉన్నతాధికారులు భుజాలు తడుముకొంటున్నారు. ఇప్పటికే టిడిపి మాజీ మంత్రి ఉమా మాధవరెడ్డి తో పాటు కొందరు తెదేపా నేతలు నయీంతో తమకి ఎటువంటి సంబంధాలు లేవని మీడియా స్టేట్మెంట్లు ఇచ్చారు. తరువాత మాజీ డిజిపి దినేష్ రెడ్డి వంతు వచ్చింది.

ఈయన కూడా నయీంతో సంబంధాలు ఉన్నట్లుగా మీడియాలో వస్తున్న వార్తలపై స్పందిస్తూ, “మాజీ డిజిపి అని అంటున్నారు కనుకనే నేను మీడియా ముందుకు వచ్చి వివరణ ఇవ్వవలసి వస్తోంది. ఆ వార్తలని నేను ఖండిస్తున్నాను. నయీంతో నేనెన్నడూ మాట్లాడలేదు. అతనితో నాకు ఎటువంటి సంబంధాలు లేవు. ఒక మీడియా ఛానల్ తన టి.ఆర్.పి రేటింగ్ పెంచుకొనేందుకు పనిగట్టుకొని నాపై అసత్య ప్రచారాలు చేస్తోంది.  ప్రజాస్వామ్య వ్యవస్థకి మూలస్థంభం వంటి మీడియా ఈ విధంగా నిరాధారమైన ఆరోపణలు, అసత్యప్రచారాలు చేయడం సరికాదు. ఒకవేళ నయీంతో నాకు సంబంధాలున్నట్లు ఆధారాలు ఉంటే వాటిని తక్షణమే బయటపెట్టాలి. పోలీస్ వ్యవస్థలోనే ఇన్ ఫార్మర్స్ వ్యవస్థ కూడా అంతర్గతంగా ఉంటుంది తప్ప నయీం వంటి సంఘ వ్యతిరేఖ శక్తుల సేవలని వాడుకోదు. నయీం కేసుని సిట్ దర్యాప్తు చేస్తోంది కనుక అతనితో ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయనే విషయం త్వరలోనే తేలిపోతుంది. అంతవరకు ఈ అసత్యప్రచారాలు, నిరాధారమైన ఆరోపణలు చేయకుండా ఉంటే మంచిది,” అని దినేష్ రెడ్డి అన్నారు.

నయీం వెనుక చాలా మంది రాజకీయనాయకులు, పోలీస్ అధికారులు ఉన్నారనే మాటని కూడా ఎవరూ కాదనడంలేదు. కానీ నయీం వంటి ఒక క్రిమినల్ తో సంబంధాలు ఉన్నాయని ఎవరూ ఒప్పుకోవడం లేదు. ఒప్పుకోలేరు...చెప్పుకోలేరు కూడా. అందరూ శాఖాహారులే అయితే మరి గంపెడు చేపలు ఏమైపోయాయి అనే సందేహం కలుగుతుంది. నయీంతో ఎవరెవరికి సంబంధాలున్నాయో పోలీసులు ప్రకటించలేదు. కానీ నిత్యం ఎవరో ఒకరు మీడియా ముందుకు వచ్చి తమకి నయీంతో ఎటువంటి సంబంధాలు లేవని చెప్పుకోవడమే విచిత్రంగా ఉంది. గుమ్మడి కాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకొన్నట్లుంది ఈ వ్యవహారం.