ఆలంపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేపై కెసిఆర్ ఆకర్ష్ మంత్రం?

ముఖ్యమంత్రి కెసిఆర్ మరో కాంగ్రెస్ ఎమ్మెల్యేపై తన ఆపరేషన్ ఆకర్ష్ మంత్రం ప్రయోగించి టిఆర్ఎస్ లోకి రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారా? అంటే అవుననే అనిపిస్తుంది. మహబూబ్ నగర్ జిల్లాలో ఆలంపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ పట్ల కెసిఆర్ చూపుతున్న ప్రత్యేక శ్రద్ధ, అభిమానం చూసినట్లయితే ఇదే విషయం నిజమనిపిస్తోంది.  

ఇటీవల ఆలంపూర్ లో జరిగిన ప్రభుత్వ కార్యక్రమాలలో ముఖ్యమంత్రి కెసిఆర్ స్వయంగా సంపత్ కుమార్ ని ఆహ్వానించి తన పక్కనే కూర్చోబెట్టుకోవడమే కాకుండా ఆయన తన నియోజకవర్గ అభివృద్ధి కోసం తనతో ఏ విధంగా పోరాడుతున్నారో కూడా చెప్పారు. ఆయన తపన చూసి తనకి చాలా ముచ్చటేసిందని ఆయన కోరినట్లుగానే ఆలంపూర్ కి వంద పడకల ప్రభుత్వాసుపత్రి, ఆర్డిఎస్ నుంచి సాగునీరు అందిస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారు. కానీ ఆర్టీసి డిపో మాత్రం ఇప్పుడు కేటాయించలేమని స్పష్టం చేశారు. టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఆయనని ఆదర్శంగా తీసుకొని తమతమ నియోజకవర్గాలు అభివృద్ధి చేసుకోవాలని కెసిఆర్ సూచించారు.

సాధారణంగా అధికార పార్టీలో చేరే ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గం అభివృద్ధి కోసమే చేరుతున్నట్లు చెప్పుకొంటారు. ఇప్పుడు కెసిఆర్ చెపుతున్నది కూడా అదే. కనుక సంపత్ కుమార్ కూడా త్వరలో జంప్ అయిపోవడం ఖాయం అనుకోవచ్చేమో?