ఓటుకి నోటు కేసు బయటపడినప్పుడు, ఏపి సిఎం చంద్రబాబు నాయుడు టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని బయటపెట్టి తెలివిగా తప్పించుకొన్నారు. రెండు ప్రభుత్వాలు ఒకదానినొకటి బ్లాక్ మెయిల్ చేసుకొంటున్నప్పుడు, ఒక కేంద్రమంత్రి జోక్యం చేసుకొని ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య రాజీ కుదర్చడంతో, పాండవులు అరణ్యవాస సమయంలో తమ ఆయుధాలని జమ్మి చెట్టుపై దాచిపెట్టినట్లుగా, ఆ ఓటుకి నోటు కేసు, టెలిఫోన్ ట్యాపింగ్ కేసు ఆయుధాలని పోలీసులు అటక మీద ఫైళ్ళ క్రింద దాచేశారు.
తెరాస ప్రభుత్వం చంద్రబాబుని, ఆయన ప్రభుత్వాన్ని తన రాజకీయ శత్రువుగా భావిస్తోంది కనుక వారిపై నిఘా పెట్టినా, వారి ఫోన్లు ట్యాపింగ్ చేసినా ఆశ్చర్యం లేదు. కానీ రాష్ట్రంలో తెలంగాణ రాజకీయ జేఏసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంపై, జేఏసిలోని ఇతర సభ్యులపై కూడా నిఘా పెట్టడం చాలా విస్మయం కలిగిస్తోంది. ప్రొఫెసర్ కోదండరాం స్వయంగా ఆ విషయం నిన్న మీడియాకి చెప్పారు.
“నేరస్తులు, నేర రాజకీయాలు చేస్తున్న వారిపై తెలంగాణ ప్రభుత్వం నిఘా పెట్టాలి కానీ ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న మామీద కాదు. తెరాస ప్రభుత్వానికి ప్రజాస్వామ్యంపై ఏ మాత్రమైన గౌరవం ఉంటే ఇటువంటి పనులు మానుకోవాలి. లేకుంటే ఇది కూడా ఒక అలవాటుగా మారిపోయి ధీర్ఘ కాలంలో ప్రజాస్వామ్యానికి చాలా హాని చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి మా కార్యక్రమాలు, ఆలోచనల గురించి ఏమైనా వివరాలు కావాలనుకొంటే అడిగితే మేమే ఇస్తాము. దాని కోసం మాపై నిఘా పెట్టడం, మా ఫోన్లు ట్యాపింగ్ చేయడం చాలా తప్పు,” అని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు.
తెలంగాణ రాజకీయ జేఏసి పనితీరుని గమనిస్తే అది ప్రభుత్వానికి చాలా విలువైన సూచనలు, నిర్మాణాత్మకమైన సలహాలు ఇస్తోందని గ్రహించవచ్చు. పైగా ప్రొఫెసర్ కోదండరాం తనకి ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చే ఆలోచన, ఉద్దశం లేవని చాలాసార్లు చెప్పారు. ప్రొఫెసర్ కోదండరాం రాజకీయాలకి అతీతంగా ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబిస్తూ ఇస్తున్న సూచనలు, సలహాలని తెలంగాణ ప్రభుత్వం స్వీకరించి ఉండి ఉంటే, దానికి నేడు ఇన్ని సమస్యలు ఎదురయ్యేవే కావు. ఒకవేళ ఎదురైనా ప్రొఫెసర్ కోదండరాం సహాయంతో వాటిని సులువుగా అధిగమించగలిగేది. కానీ తెలంగాణ రాజకీయ జేఏసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం తమ ప్రభుత్వంలో లోటుపాట్లని, తప్పులని ఎత్తిచూపిస్తూ విమర్శిస్తున్నందున జేఏసిని కూడా ఒక ప్రతిపక్ష పార్టీగా భావించి, దానిపై నిఘా పెట్టినట్లు భావించవలసి ఉంటుంది.
రాష్ట్రంలో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలని, అవి ఇస్తున్న సూచనలు, సలహాలని రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా పట్టించుకోవడం లేదో, అదే విధంగా ఒకవేళ జేఏసి సలహాలు అవసరం లేదనుకొంటే దానిని కూడా ప్రభుత్వం పట్టించుకోనవసరం లేదు. కానీ దానిపై నిఘా పెట్టవలసిన అవసరం కూడా లేదు. ఎందుకంటే దాని కార్యక్రమాలన్నీ చాలా పారదర్శకంగా, బహిరంగంగానే జరుగుతుంటాయి కనుక.