గ్యాంగ్ స్టర్ నయీం కేసులో తవ్విన కోద్ది పాపల చిట్టా భయపెడుతుంది. ఎందెందు వెతికినా అందందు నయామ్ అరాచకాలే వెలుగుచూస్తున్నాయి. తాను రాజకీయాల్లోకి వచ్చేందుకు పలు ప్రాంతాల్లో మీడియాను తన చేతుల్లోకి తీసుకున్న నయీమ్.. అటు శాటిలైట్ ఛానెల్ ను కూడా ప్రారంభించాలన్న వార్త తెలిసి మీడియా వర్గాలు వణకగా, ఇప్పుడిదే పరిస్థితిల్లో టాలీవుడ్ వర్గాలు ఉన్నాయి. తెలుగు సినీ పరిశ్రమలోనూ కొందరితో నయీమ్ సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. నయీం తన స్వీయ చరిత్రనూ తెరకెక్కించాలని భావించినట్లు సమాచారం. రాజకీయాలపై ఆసక్తితో ఉన్న నయీం భువనగిరి అసెంబ్లీ సీటుపై కన్నేయడం.. దీంతో తనపై ఉన్న నెగిటివ్ ఇమేజ్ ను తగ్గించుకునేందుకు ప్రయత్నించినట్లు వెలుగులోకి వచ్చింది.
కరుడుగట్టిన నేరగాడైన నయీంకు మాజీ మావోయిస్టుగా, గ్యాంగ్‌స్టర్‌గానే పేరుంది. ఇతడి ఆగడాలు, చేసిన దారుణాలకు అంతే లేకపోవడంతో స్థానికంగానూ నయీం అంటే భయంతో పాటు చెడ్డ పేరూ ఉంది. ఇవి ఇలానే కొనసాగితే రాజకీయాల్లో అడుగుపెట్టడం, రాణించడం కష్టమంటూ నయీంకు ‘సన్నిహితులు’ సలహా ఇచ్చారు. దీంతో నెగెటివ్ ఇమేజ్‌ను పొగొట్టుకునే ప్రయత్నాల్లో భాగంగానే భువనగిరి నియోజకవర్గంలోని 30 వార్డుల్లో 30 వాటర్‌ప్లాంట్స్ నిర్మాణానికి చేసిన ప్రయత్నం చేయగా అది ఫలించలేదు. ఈ నేపథ్యంలోనే నయీం దృష్టి రాయలసీమ ఫ్యాక్షనిజం ప్రధానంగా వచ్చిన ‘రక్తచరిత్ర’ చిత్రాలపై పడింది. అదే మాదిరిగా తన స్వీయచరిత్రను తెరకెక్కించాలని భావించాడు. నయీం గతంలో జూబ్లీహిల్స్‌లోని ఓ క్లబ్‌కు తరచుగా వెళ్ళేవాడు. ఇది సినీ ప్రముఖులు ఎక్కువగా వచ్చేది కావడంతో అక్కడే పరిచయమైన వారి ద్వారానే చిత్రీకరించడానికి నిర్ణయించుకున్నాడని సమాచారం.