తెరాస 2014 ఎన్నికల మ్యానిఫెస్టోలో ముస్లింలకి 12శాతం, గిరిజనులకి 12శాతం రిజర్వేషన్లు కల్పిస్తామనే హామీ ఉంది. టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి కెసిఆర్ తప్పకుండా రిజర్వేషన్లు కల్పిస్తామని చాలా సార్లు గట్టిగా చెప్పారు. మళ్ళీ ఇప్పుడు కూడా గట్టిగానే చెపుతున్నారు. కానీ అసలిచ్చేదెప్పుడో మాత్రం చెప్పడం లేదు.
ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, “తమిళనాడులో ప్రత్యేక చట్టం ద్వారా ముస్లింలకి రిజర్వేషన్లు కల్పించారు. ఆ చట్టాన్ని అధ్యయనం చేసి దాని ప్రకారమే మన రాష్ట్రంలో కూడా ప్రత్యేక చట్టాన్ని తయారు చేసి ముస్లింలకి రిజర్వేషన్లు కల్పిస్తాము అని చెప్పారు. గిరిజనుల జనాభాని బట్టి వారికీ రిజర్వేషన్లు కల్పించవచ్చని రాజ్యాంగంలో ఉంది. కనుక దాని ప్రకారం వారికీ రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పారు.
సమాజంలో బలహీన వర్గాలకి రిజర్వేషన్లు కల్పించడాన్ని ఎవరూ తప్పు పట్టలేరు కానీ రిజర్వేషన్లకి గరిష్ట పరిమితి 55 శాతం కంటే మించడానికి వీలులేదని రాజ్యాంగంలోనే పేర్కొనబడింది. కెసిఆర్ చెపుతున్నట్లుగా ఆ రెండు వర్గాలకి రిజర్వేషన్లు ఇవ్వాలంటే అదే 24శాతం అవుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో రిజర్వేషన్ల శాతం రాజ్యాంగం చెప్పిన ఆ గరిష్ట పరిమితికి చేరుకొన్నాయి. కనుక ఈ రెండు వర్గాలకి రిజర్వేషన్లు ఇవ్వాలంటే వేరే వర్గాల రిజర్వేషన్లలో కోత పెట్టక తప్పదు. దాని కోసం ప్రత్యేక చట్టం తీసుకురావడం పెద్ద కష్టమేమీ కాదు కానీ ఈ రిజర్వేషన్ల వలన నష్టపోయే వర్గాలు అందుకు సమ్మతిస్తాయా? అంటే కాదనే సమాధానం వస్తుంది. ఆంధ్రాలో కాపులకి రిజర్వేషన్లు కోరుతూ ముద్రగడ చేస్తున్న ఉద్యమాన్ని బీసీలు వ్యతిరేకించడం గమనిస్తే ఆ సంగతి అర్ధమవుతుంది. కనుక ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ రిజర్వేషన్ల తేనెతుట్టెని కదిపితే తరువాత చాలా బాధపడవలసి రావచ్చు. వీలైతే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి సమిష్టి నిర్ణయం తీసుకొంటే ఆ తరువాత ఎవరూ వేలెత్తి చూపే అవకాశం ఉండక పోవచ్చు.