ఓటుకి నోటు కేసు తరువాత రాష్ట్రంలో టిడిపిని దెబ్బతీయడానికి మళ్ళీ అంత బలమైన గ్యాంగ్ స్టర్ నయీం కేసు అధికార టిఆర్ఎస్ పార్టీకి చేతికి చిక్కినందుకు వారు చాలా సంతోషిస్తున్నట్లే ఉన్నారు. నయీంతో మాజీ మంత్రి ఉమా మాధవరెడ్డితో సహా కొంతమంది టిడిపి నేతలకి సంబంధాలు ఉన్నట్లు పోలీసులు చెపుతున్న మాట వాస్తవమైతే, టిఆర్ఎస్ కి అంతకంటే కావలసింది ఏముంటుంది. నిజామాబాద్ టిఆర్ఎస్ ఎంపి కవిత మీడియాతో మాట్లాడుతూ, “నయీం తో ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయో, అతనితో కలిసి ఏమేమి అక్రమాలకి పాల్పడ్డారనే విషయాలన్నీ పోలీసుల దర్యాప్తులో బయటపడుతుంది. తెలంగాణలో అరాచక శక్తుల ఆట కట్టించే సమయం ఆసన్నమయింది. దోషులు ఎంత పెద్దవారైనా విడిచిపెట్టము,” అని అన్నారు.
నయీంకి రాజకీయ నేతలతో, పోలీస్ ఉన్నతాధికారులతో బలమైన సంబంధాలు ఉండేవని, వారు నయీం ‘ప్రత్యేక సేవలని ప్రత్యేక పనుల కోసం’ వినియోగించుకునేవారని చాలా మంది రాజకీయ నాయకులు, ప్రజా సంఘాల నేతలే ఇప్పుడు బహిరంగంగా చెపుతున్నారు. కనుక తెదేపా నేతలతో సహా అన్ని పార్టీల నేతలతో నయీం కి సంబంధాలు ఉండే ఉండవచ్చు. నయీంతో సంబంధాలున్న టిడిపి నేతలు కొందరు టిఆర్ఎస్ పార్టీలో చేరారని, కనుక నయీం ఎన్ కౌంటర్ పై న్యాయవిచారణ జరిపించినట్లయితే వారి అక్రమాలు కూడా బయట పడతాయని ఉమా మాధవ రెడ్డి కుమారుడు సంపత్ రెడ్డి చెప్పారు. అతని తల్లి నయీంతో తమకి సంబంధం లేదని చెపుతుంటే అతను టిఆర్ఎస్ ని ఇబ్బంది పెట్టేందుకు చెప్పిన మాటలు నయీంతో టిడిపి నేతలకి సంబంధాలున్నాయని దృవీకరించినట్లయింది.
నయీంతో అన్ని పార్టీల నేతలకి సంబంధాలు ఉన్నప్పటికీ, టిఆర్ఎస్ అధికారంలో ఉంది కనుక ఎవరి పేర్లు కావాలనుకొంటే వాటిని బయటపెట్టవచ్చు. అందుకే రేవంత్ రెడ్డి, ఉమా మాధవ్ రెడ్డి, మోత్కుపల్లి నరసింహులు తదితర టిడిపి నేతలు అందరూ ఈ కేసులో టిఆర్ఎస్ ప్రభుత్వం తన నేతలని కాపాడుకొని, ప్రతిపక్షాల నేతలపై ఆరోపణలు చేస్తూ రాజకీయ కక్ష సాధింపుకి పాల్పడుతోందని వాదిస్తున్నారు.
ఇటువంటి అభియోగాలు ఎదురైనప్పుడల్లా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఇదే విధంగా వాదోపవాదాలు జరుగుతుంటాయి. సిరిసిల్ల రాజయ్య కోడలు, మనుమల ఆత్మహత్య కేసులో కూడా ఏదో జరిగి పోతుందని అనుకొన్నారు. కానీ నెలరోజులు జైల్లో కూర్చొని అందరూ బయటకి వచ్చేశారు. ఓటుకి నోటు కేసులో చంద్రబాబు నాయుడుని, రేవంత్ రెడ్డిని ఆ బ్రహ్మ దేవుడు కూడా రక్షించలేడని కెసిఆర్ తో సహా మంత్రులు అందరూ అన్నారు. కానీ చివరికి ఏమైంది? కనుక చివరికి ఇదీ అలాగే ముగిసిపోవడం ఖాయం. రాజకీయ నాయకులు పైకి వేర్వేరు జాతులు వారిలా కనిపిస్తుంటారు కానీ అందరూ ఒక జాతివారే. ఒకరిని ఒకరు కాపాడుకొంటూనే ఉంటారు. ఆ సంగతి మీడియాకి కూడా తెలుసు. కానీ అందరికీ ఇల్లు గడవాలి కదా...అందుకే ఈ ఎంటర్టెయిన్మెంట్!