రాష్ట్రంలో అగమ్యంగా సాగుతున్న బిజెపి

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనతో ఆ రాష్ట్ర బిజెపి నేతలలో కొంత ఉత్సాహం వచ్చినట్లే కనిపిస్తోంది. ప్రధాని పిలుపు మేరకు ఆగస్ట్ 9 నుంచి 22వరకు 70వ స్వాతంత్ర ఉత్సవాలని, ఆగస్ట్ 15 నుంచి సెప్టెంబర్ 17వరకు తిరంగా ఉత్సవాలని ఘనంగా నిర్వహించడానికి సన్నద్ధం అవుతోంది. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కూడా జరుపుతామని రాష్ట్ర అధ్యక్షుడు డా.లక్ష్మణ్ చెప్పారు. టిఆర్ఎస్ ప్రభుత్వం మజ్లీస్ పార్టీ ఒత్తిడికి తలొగ్గి విమోచన దినోత్సవాన్ని జరపడం లేదని ఆయన విమర్శించారు. ఈ ఉత్సవాల సందర్భంగా బైక్ ర్యాలీలు, కాగడాల ప్రదర్శనలు, చైతన్య సభలు వగైరా నిర్వహిస్తామని డా.లక్ష్మణ్ తెలిపారు.  

అది బిజెపి కావచ్చు లేదా కాంగ్రెస్ పార్టీ కావచ్చు..ఏ రాజకీయ పార్టీ అయినా ఏ పేరుతో హడావుడి చేసినా అది తన ఉనికిని చాటుకొని ప్రజలని ఆకట్టుకోవడానికే. కనుక బిజెపి చేయబోయే ఈ హడావుడి వలన దానికేమైనా లాభం కలుగుతుందా లేదో చూడాలి. కానీ రాష్ట్ర భాజపా నేతలకి నేటికీ టిఆర్ఎస్ పట్ల ఎటువంటి వైఖరి అవలంభించాలనే దానిపై స్పష్టత లేకుండా రోడ్లెక్కాలనుకోవడం విచిత్రంగా ఉంది.

రాష్ట్ర బిజెపి నేతలు టిఆర్ఎస్ ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే, కేంద్రమంత్రులు, కేంద్రప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వానికి చాలా అనుకూలంగా వ్యవహరిస్తుంటారు. అదే విధంగా టిఆర్ఎస్ అధిష్టానం కూడా కేంద్ర ప్రభుత్వంతో చాలా సానుకూలంగా వ్యవహరిస్తుంటుంది. ఆ విషయం గజ్వేల్ సభలో మరొకమారు బయటపడింది.

కనుక టిఆర్ఎస్ తమ శత్రువో మిత్రుడో తేల్చుకోకుండా రాష్ట్ర బిజెపి నేతలు అగమ్యంగా ముందుకు సాగడం వలన వారు తమ ఉనికిని కాపాడుకోగలరేమో గానీ రాష్ట్రంలో ఎన్నటికీ టిఆర్ఎస్ కి ప్రత్యామ్నాయంగా బిజెపి ఎదగలేదు. కనుక ముందుగా టిఆర్ఎస్ గురించి తమ పార్టీ వైఖరి ఏమిటో తెలుసుకొని తదనుగుణంగా దానికి అనుకూలంగా కానీ, వ్యతిరేకంగా గానీ నినాదాలు చేస్తూ రోడ్డెక్కితే ఏమయినా ప్రయోజనం ఉంటుంది. లేకుంటే బిజెపి చేస్తున్న ఇటువంటి ప్రయత్నాలన్నీ ఏట్లో పిసికిన చింతపండే అవుతుంది.