టిఆర్ఎస్ ప్రభుత్వం నడక, మల్లన్నసాగర్ ప్రాజెక్టుపై మూడడుగులు ముందుకి రెండు అడుగులు వెనక్కి అన్నట్లు సాగుతోంది. జీవో: 123పై హైకోర్టు స్టే మంజూరు చేసింది కానీ ఆ ప్రాజెక్టు నిర్వాసితులకి నష్టపరిహారం, పునరావాసం కల్పించేందుకు టిఆర్ఎస్ ప్రభుత్వం ఏవిధమైన చర్యలు తీసుకోవాలనుకొంటోందో విధివిధానాలు సూచిస్తూ నిర్దిష్టమైన ప్రతిపాదనలతో రమ్మని ఆదేశించడంతో టిఆర్ఎస్ ప్రభుత్వం నిన్న మరో కొత్త జీవో జారీ చేసింది. దానిలో కోర్టు ఆదేశించినట్లుగానే అన్నీ నిర్దిష్టంగా పేర్కొంది.
ఈరోజు ఆ కేసు విచారణ చేపట్టిన హైకోర్టు, ఆ కొత్త జీవోపై కూడా చాలా అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ భూసేకరణ ప్రక్రియ కారణంగా నష్టపోతున్న రైతులకి ఆ ప్రక్రియ పూర్తయ్యే వరకు నెలకి రూ.2,500 తాత్కాలిక పరిహారం చెల్లించమని ఇదివరకు హైకోర్టు ఆదేశించింది. తమ ఆదేశాలని ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదని హైకోర్టు ప్రశ్నించింది. కొత్త జీవోలో నిర్వాసితులలో ఉమ్మడి కుటుంబాలకి ఏ విధంగా నష్టపరిహారం చెల్లించదలచుకొందో నిర్దిష్టంగా పేర్కొనక పోవడాన్ని హైకోర్టు తప్పు పట్టింది. జీవోలో మళ్ళీ మార్పులు చేర్పులు చేసి, ఆ వివరాలు వచ్చే మంగళవారంలోగా అఫిడవిట్ ద్వారా తనకి సమర్పించమని హైకోర్టు ఆదేశించి, కేసుని ఆగస్ట్ 23కి వాయిదా వేసింది.
టిఆర్ఎస్ ప్రభుత్వం నిన్న జారీ చేసిన జీవోలో నిర్వాసితులందరికీ న్యాయం చేకూరే విధంగానే రూపొందించింది. కానీ కొత్త జీవో జారీ చేయడానికి రెండు రోజులే సమయం ఇవ్వడంతో ఆ తొందరలో కొన్ని సాంకేతిక అంశాలని విస్మరించినట్టుంది. అందుకే మళ్ళీ ఎదురుదెబ్బ తగిలింది. కానీ జీవో:123ని పునరుద్ధరించినప్పుడే దానికి హైకోర్టు వ్యతిరేకం కాదనే సంకేతం ఇచ్చినట్లు భావించవచ్చు. కనుక హైకోర్టు సూచించిన విధంగా సవరణలు చేసి సమర్పిస్తే మల్లన్నసాగర్ ప్రాజెక్టు భూసేకరణకి హైకోర్టు నుంచి లైన్ క్లియర్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి.