గ్యాంగ్ స్టార్ నయీం ఇంట్లో పోలీసులు స్వాధీనం చేసుకొన్న ఒక డైరీలో టిడిపి మాజీ మంత్రి స్వర్గీయ మాధవరెడ్డి పేరున్నట్లు మీడియాకి లీకులు వచ్చాయి. ఆ తరువాత దుబ్బాక టిఆర్ఎస్ ఎమ్మెల్యే రామలింగా రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “నయీంని పెంచి పోషించింది చంద్రబాబు నాయుడే. 2004 ఎన్నికలలో నన్ను పోటీ చేయవద్దని నయీం బెదిరించాడు. అప్పుడు నేను సిద్ధిపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదు,” అని తీవ్ర ఆరోపణలు చేశారు.
మీడియాలో వస్తున్న ఈ వార్తలని, టిఆర్ఎస్ నేతల ఆరోపణలని ఉమా మాధవరెడ్డి ఖండించారు. తనకి కానీ తన భర్తకి గానీ నయీం ఎటువంటి పరిచయం, సంబంధం లేదని, ఏనాడూ అతనితో మాట్లాడలేదని అన్నారు. ఇటువంటి దుష్ప్రచారం చేస్తూ టిఆర్ఎస్ ప్రభుత్వం తనపై రాజకీయ కక్ష సాధింపులకి పాల్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవేళ నయీంతో మాకు సంబంధాలు ఉన్నట్లు రుజువు చేయగలిగితే ఏ శిక్ష అనుభవించడానికైనా సిద్ధమని ఆమె సవాలు విసిరారు.
టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. తమ పార్టీ ఉమామాధవ రెడ్డి కుటుంబానికి అండగా ఉంటుందని చెప్పారు. టిఆర్ఎస్ ప్రభుత్వం తమ పార్టీకి చెందిన వారినందరినీ తప్పించి, తమ రాజకీయ ప్రత్యర్ధులని ఇందులో ఇరికించి దెబ్బ తీయాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు. నయీం ఎన్ కౌంటర్ పై టిఆర్ఎస్ ప్రభుత్వం చేయిస్తున్న సిట్ విచారణపై తమకి నమ్మకం లేదని న్యాయవిచారణ జరిపించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
నయీంతో టిడిపి నేతలకి సంబంధాలు ఉన్నాలేకపోయినా వారి పేర్లు మీడియాలో వస్తున్నందున తెలంగాణ లో టిడిపికి మూడినట్లే భావించవచ్చు. నయీం డైరీలో పేర్లు ఉన్నాయనే వార్తలే టిడిపికి చాలా నష్టం కలిగిస్తున్నప్పుడు ఒకవేళ టిడిపి నేతలకి నయీంతో నిజంగానే సంబంధాలు ఉన్నట్లు రుజువయితే ఇక తెలంగాణలో తెదేపా తలెత్తుకొని తిరగలేదు. ఇది టిడిపికి చావు దెబ్బ అవుతుంది. కోలుకోవడం చాలా కష్టమవుతుంది.