హైకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్వాసితులకి చాలా మంచి ప్యాకేజి ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం నిన్న జారీ చేసిన తాజా జీవోలో నిర్వాసిత కుటుంబాలకి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కట్టించి ఇస్తామని పేర్కొంది. ఆ ప్రాజెక్టులోనే కుటుంబానికి ఒక ఉద్యోగం లేదా ఉపాధి కల్పన లేదా ఏకమొత్తంగా రూ.5లక్షల నగదు పరిహారం ఇస్తామని హామీ ఇచ్చింది. ఉద్యోగం, ఉపాధి వద్దనుకొంటే ఎస్సీ, ఎస్టీ నిర్వాసిత కుటుంబాలకి నెలకి రూ.3,000 చొప్పున, ఇతరులకి నెలకి రూ.2,500 చొప్పున 20 ఏళ్ళపాటు నష్టపరిహారంగా చెల్లిస్తామని హామీ ఇచ్చింది.
అదిగాక జీవనోపాధి భ్రుతి, నిర్వాసిత కుటుంబాల తరలింపు, పునర్నిర్మాణం వంటి ఇతర అవసరాలకి నిర్దిష్టంగా నష్టపరిహారం చెల్లించడానికి కూడా ప్రభుత్వం అంగీకరించింది. నష్టపరిహారంగా ఇవేవీ వద్దనుకొన్నట్లయితే ఒకేసారి రూ.7.5 లక్షలు వన్ టైం సెటిల్మెంటుగా ప్రభుత్వం చెల్లిస్తుంది. మల్లన్నసాగర్ ప్రాజెక్టులో శాశ్వతంగా చేపల పెంపకం, మరియు చేపలు పట్టుకోవడానికి నిర్వాసితులకి పూర్తి హక్కులు కల్పిస్తుంది.
రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఈ ప్రతిపాదనలు నిర్వాసితులకి పూర్తి న్యాయం చేసే విధంగానే ఉన్నాయి. హైకోర్టు, నిర్వాసితులు అందుకు అంగీకరించినా, ప్రతిపక్షాలు అంగీకరిస్తాయనే నమ్మకం లేదు. కనుక దానిలో కూడా ఏవో లోపాలని ఎత్తి చూపించి దానినీ వ్యతిరేకిస్తూ మళ్ళీ ఉద్యమించవచ్చు. లేదా ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారం ఏమాత్రం సరిపోదని దానిని మరింత పెంచమని డిమాండ్ చేయవచ్చు.
భూమి ధర చెల్లింపు, ఇళ్ళు, ఉద్యోగం, ఇతరత్రా పరిహారాలు బాగానే ఉన్నప్పటికీ ఉద్యోగం, ఉపాధి వద్దనుకొని ప్రభుత్వం ఇచ్చే నెలకి రూ.2-3,000కి ఆశపడితే, మున్ముందు నిర్వాసితులు నష్టపోయే ప్రమాదం ఉంది. ఒక ప్రభుత్వం లిఖిత పూర్వకంగా ఇచ్చిన హామీలని తరువాత అధికారంలోకి వచ్చే ప్రభుత్వం అమలు చేస్తుందనే నమ్మకం పోయిందిప్పుడు. పైగా 20ఏళ్ళ సుధీర్గ కాలం పాటు నష్టపరిహారం నెలనెలా అందుతుందనే నమ్మకం కూడా లేదు. కనుక అమాయకులైన నిర్వాసితులకి అన్యాయం జరుగకుండా చూడవలసిన బాధ్యత అధికార ప్రతిపక్షాల రెంటి మీద ఉంది.