16 ఏళ్లుగా ఒకే ఒక్క అంశంపై నిరాహారదీక్ష చేస్తున్నా.. కేంద్ర ప్రభుత్వం అసలు కనికరించకుండా.. అమెను పట్టించుకోకుండా వ్యవహరిస్తున్న నేపథ్యంలో దీక్షకు స్వస్తి పలికి ఇక ప్రజాస్వామ్య దేశంలో రాజకీయంగానే పావులు కదపాలని నిర్ణయించుకుంది ఉక్కు మహిళ ఇరోం షర్మిల. దేశంలోని ఈశాన్య రాష్ట్రాలలో సైనిక బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని రద్దు చేయాలంటూ 16 ఏళ్ల క్రితం నిరాహార దీక్ష చేపట్టిన ఆమె దీక్షను విరమించడంతో కొన్ని సంస్థలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ నేపథ్యంలో అస్పత్రి వద్ద సాయుధ పోలీసు బలగాలను మోహరించారు.
షర్మిల ప్రస్తుతం ఇక్కడి జవహర్‌లాల్ నెహ్రూ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ ఆస్పత్రి వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారు. 16 ఏళ్లపాటు నిరసన కొనసాగినందువల్ల శరీరం ఒక్కసారిగా ఘన ఆహారానికి మారే పరిస్థితి లేదని, ప్రస్తుతానికి ప్రత్యేక ద్రవాహారాన్ని అందజేస్తున్నామని వైద్యులు చెప్పారు. దీక్షను విరమించినప్పటికీ సైనిక చట్టం రద్దు చేసేవరకూ గోళ్లను కత్తిరించుకోరాదన్న, తల దువ్వుకోరాదన్న, ఇంటికెళ్లి తన తల్లిని కలుసుకోరాదన్న నిర్ణయాన్ని ఆమె కొనసాగిస్తున్నారు.
ఆరోగ్య రహస్యం చెప్పిన షర్మిల
16 ఏళ్ల నిరహార దీక్ష చేసినప్పటికీ షర్మిల ఆరోగ్యం దాదాపు నిలకడగానే ఉండడం వెనుక సీక్రెట్ ను ఆమె బయటపెట్టింది. తన ఆరోగ్యం వెనుక పెద్ద రహస్యం ఏమీ లేదని అయితే దృఢ సంకల్పం, నిత్య యోగా సాధన అలవాటే ఆమె ఇంతకాలం జీవించడానికి గల కారణమని షర్మిల సోదరుడు సింఘాజిత్ చెప్పారు. దీక్షకు దిగే రెండేళ్ల ముందే (1998లో) షర్మిల యోగా నేర్చుకున్నట్లు కుటుంబ సభ్యులు, సన్నిహితులు తెలిపారు. ప్రకృతి చికిత్సపై మక్కువతో షర్మిల ఆ కోర్సును ఎంపిక చేసుకోగా అందులో యోగాభ్యాసం కూడా ఉన్నట్లు వివరించారు.