మణిపూర్ ఇంఫాల్ లో జంట బాంబు పేలుళ్లు..

మ‌ణిపూర్ రాజ‌ధాని ఇంఫాల్ పేలుళ్ల మోత‌తో ద‌ద్ద‌రిల్లింది. రెండు వ‌రుస పేలుళ్ల‌తో అక్క‌డి ప్ర‌జ‌లు తీవ్ర ఆందోళ‌న చెందారు. గంటల వ్యవధిలో చోటుచేసుకున్న రెండు బాంబు పేలుళ్లు నేపథ్యంలో మణిపూర్ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. రెండు వరుస పేలుళ్లు జరగడంతో ఇంఫాల్‌ నగరవాసులు ఉలిక్కిపడ్డారు. ఉదయం బీఎస్‌ఎఫ్ శిబిరం సమీపంలో ఐఈడీ పేలుడు సంభ‌వించింది. పేలుడుతో గాయ‌ప‌డిన ఏడేళ్ల బాలికను సమీపంలోని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. బీఎస్ఎఫ్ దళాలను టార్గెట్ గా చేసుకునే ఈ పేలుళ్లు జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. 

ఈ ఘటన జరిగిన కొన్ని గంటల లోనే ఇంఫాల్ లోని మణిపూర్ యూనివర్సిటీ వద్ద మరో బాంబు పేలుడు జరిగింది. రిమోట్ ద్వారానే ఈ రెండు బాంబు పేలుడ్లు జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. మాపౌ అనే గ్రామం వద్ద బీఎస్ఎఫ్ బలగాలు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా అనూహ్యంగా బాంబు పేలింది. అయితే, ఈ దాడి నుంచి బీఎస్ఎఫ్ జవాన్లు తప్పించుకోగా.. నాలుగేళ్ల పాపకు మాత్రం గాయాలయ్యాయి. రెండోసారి బాంబు దాడి మాత్రం యూనివర్సిటీ వద్ద జరిగింది. ఈ ఘటన సమయంలో విద్యార్థులంతా క్లాస్ రూముల్లోనే ఉన్నారు. కాబట్టి ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని ప్రాథమిక సమాచారం.