కృష్ణమ్మ ఫుష్కరానికి సమయం ఆసన్నం.. పూర్తికాని పనులు

నదులను దేవతలతో పోల్చే హైందవ ధర్మంలో ఒక్కో సందర్భంలో ఒక్కో నదికి పుష్కరాలను జరుపుకోవడం సంప్రదాయం. ఇది అనాధిగా వస్తున్న ఆచారం. గత ఏడాది గోదావరి పుష్కరాలు జరుపుకున్న నేపథ్యంలో ఈ ఏడాది కృష్ణమ్మకు పుష్కర సమయం ఆసన్నమైంది. మరికొన్ని గంటల వ్యవధితో కృష్ణమ్మ ఫుష్కర శోభ రానుంది. ఇక భక్తులు ఈ నదీ ప్రవాహం పక్కన ఫుణ్యస్నానాలు ఆచరించడంతో పాటు పితృదేవతలకు పిండప్రదానాలు చేయించడం, శాంతి పూజలు జరిపించడం వంటి కార్యక్రమాలతో హోరెత్తనుంది. 

ఇందుకుగాను కృష్ణా పుష్కరాలకు శుక్రవారం అంకురార్పణ జరగనుంది. రాష్ట్రంలో రేపు ఉదయం 5.58 గంటల నుంచి పుష్కరాలు మొదలవుతాయని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. 23వ తేదీ వరకు 12 రోజుల పాటు జరిగే పుష్కరాల్లో దాదాపు మూడున్నర కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరిస్తారని అంచనా. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేపట్టింది. పుష్కర పనుల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం రూ.825 కోట్లు వెచ్చించింది.  

సీఎం కేసీఆర్ మహబూబ్‌నగర్ జిల్లా ఆలంపూర్ జోగులాంబ ఆలయ సమీపంలో గొందిమల్ల ఘాట్‌లో శుక్రవారం ప్రాతఃకాలంలో సతీసమేతంగా పుణ్య స్నానమాచరిస్తారు. సీఎం దంపతులు గురువారం సాయంత్రం ఆలంపూర్ చేరుకుని హరిత గెస్ట్‌హౌస్‌లో బస చేస్తారు. ఉదయం 5.58 గంటలకు పుష్కర స్నానానంతరం జోగులాంబను దర్శించుకుంటారు. సీఎంతో పాటు గవర్నర్ నరసింహన్ కూడా వస్తారని ప్రభుత్వ వర్గాలంటున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో 52, నల్లగొండలో 29 చొప్పున రూ.212 కోట్లతో 81 ఘాట్లు ఏర్పాటు చేశారు. 

పాలమూరులో బీచుపల్లి, ఆలంపూర్, రంగాపూర్, కృష్ణా, గొందిమల్ల; నల్లగొండ జిల్లాలో మఠంపల్లి, వాడపల్లి, నాగార్జునసాగర్, ఛాయాసముద్రం తదీతర ఘాట్లకు భక్తులు పోటెత్తేలా ఉండటంతో గజ ఈతగాళ్లను, మరబోట్లను సిద్ధం చేశారు. మొసళ్లు కొట్టుకొచ్చే ప్రమాదమున్నందున ఘాట్ల వద్ద నదిలో కంచెలు ఏర్పాటు చేశారు. 15 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూములు, కాల్ సెంటర్లు పెట్టి సీసీ కెమెరాలు అమర్చారు. వృద్ధులు, వికలాంగులు, పిల్లల కోసం ఘాట్ల వద్ద షవర్లు ఏర్పాటు చేశారు

అయితే తెలుగు రాష్ట్రాలలో పుష్కర పనులు ఇంకా పూర్తి కాలేదు. మరికొన్ని గంటల్లో పుష్కరాలు ప్రారంభం కాబోతున్నా.. ఆ పనులు మాత్రం పూర్తి కాకపోవడంతో.. ఎక్కడికెళ్ళి పుణ్యస్నానాలను ఆచరించాలని భక్తులు అందోళన చెందుతున్నారు. గోదావరి పుష్కరాలను విజయవంతంగా నిర్వహించిన ప్రభుత్వానికి కృష్ణ పుష్కరాలు మాత్రం ఇబ్బందులకు గురిచేసాలా వుంది. పుష్కర ఘాట్ల రోడ్ల నిర్మాణం అస్తవ్యస్తంగా మారింది. భారీ వర్షాల వల్ల నెల రోజులుగా పనులు సాగక పలుచోట్ల పనులు సగం కూడా పూర్తికాలేదు. దీంతో భక్తులు ఇబ్బందులకు గురికాక తప్పదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.