పోలీసులు, రాజకీయ నేతల అండదండలు పుష్కలంగా ఉండి నేర సామ్రాజ్యాన్ని పాలించిన మాజీ మావోయిస్టు, గ్యాంగ్ స్టర్ నయీముద్దీన్ అలియాస్ నయీం తన అత్మరక్షక దళాలుగా మహిళలను ఏర్పాటు చేసుకుని తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించాడని వార్తలు వెలుగులోకి వచ్చాయి. లిబియా అధ్యక్షుడు గఢాఫీ తరహాలోనే నయీం కూడా మహిళలకే తనను రక్షించే బాధ్యతలను అప్పగించాడని సమాచారం. దీంతోనే ఆయన ఎప్పుడు ఎక్కడ వుంటున్నది తెలియడానికి కొంత సమయం తీసుకుందని కూడా పోలీసులు వర్గాలు చెబుతున్నాయి.
అయితే నయీంను హతమార్చిన తరువాత ఈ కేసును చేధిస్తున్న పోలీసులు.. లెక్కకు మించిన అక్రమాస్థులు ఆస్తులు.. కట్టల కొద్దీ డబ్బు బయటపడటంతో..ఈ కేసును తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందానికి అప్పగించింది. ఐజీ నాగిరెడ్డి నేతృత్వంలోని సిట్ అధికారుల బృందం కోర్టు అనుమతివ్వడంతో నార్సింగిలోని నయీం ఇంట్లో స్వయంగా సోదాలు చేపట్టారు. నయీం బెడ్ రూమ్, పర్సనల్ రూమ్ లో తనిఖీలు చేపట్టాక, భారీగా డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
అలాగే రాజేంద్రనగర్ మండలం నెక్నాంపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని అల్కాపురి టౌన్షిప్లో నయీం ఇంట్లో 60కి పైగా ఖరీదైన వాచీలు, డైమండ్ రింగ్స్, ఏకే-47 గన్ ఉన్నట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే నయీం కుటుంబసభ్యులు, అనుచరులలో కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వనస్థలిపురం ద్వారకామయినగర్ లో నయీం అనుచరుడు ఖయ్యూమ్ ఇంటిని బుధవారం పోలీసులు గుర్తించారు. ఖయ్యూమ్ ఇంట్లో కీలక డాక్యుమెంట్లు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఆ ఇంట్లోనే మరో ఇద్దరు అనుచరులు నరేష్, సుధాకర్ ఉంటున్నారు. అయితే నయీం ఎన్ కౌంటర్ తర్వాత వారు అక్కడి నుంచి పరారయ్యారు. వారిద్దరు రిటైర్డు ఏసీపీ ఇంటి సమీపంలో షెల్టర్ ఏర్పాటు చేసుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
అలాగే మెదక్ జిల్లా నారాయణఖేడ్ లో కూడా పోలీసులు విస్తృత సోదాలు చేపట్టారు. నయీం అనుచరులు ఉన్నారనే సమాచారంతో తనిఖీలు నిర్వహించారు. ఓ లాడ్జిలో ముగ్గరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఇదిలా ఉండగానే నయీం తన నేరసామ్రాజ్యానికి విఘాతం కలగకుండా వుండేందుకు తాను చట్టసభలకు ఎన్నిక కావాలని భావించాడని సమాచారం. అందుకోసం ఏకంగా చక్కటి స్కెచ్ కూడా వేశాడట. తన ఎన్నికల ప్రచారం కోసం త్వరలోనే తెలంగాణ లో శాటిలైట్ టీవీ ఛానల్ ను కూడా ప్రారంభించాలనుకున్నాడని సమాచారం. ఇప్పటికే నయీం ఆన్ లైన్ టీవీ (ఇంటర్నెట్) నడుపుతున్నాడు. నల్గొండ, భువనగిరిలలో లోకల్ కేబుల్ ఛానల్స్ కూడా అతని మనుషులకు ఉన్నాయి. అతను త్వరలో తెలంగాణలో శాటిలైట్ టీవీ ఛానల్ను కూడా ప్రారంభించాలనుకున్నాడని తెలుస్తోంది. ఈస్ట్ ఆఫ్రికా దేశాల్లో కేబుల్ టీవీ వ్యాపారాన్ని ప్రారంభించాలనుకున్నాడట.