సిపిఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ నోటి దురుసుతనం గురించి తెలిసిందే. “దళితులపై దాడి చేయడం కాదు కావాలనుకొంటే నన్ను కాల్చి చంపండి” అని ప్రధాని నరేంద్ర మోడీ మొన్న హైదరాబాద్ సభలో అన్న మాటని పట్టుకొని కె.నారాయణ, “ఆయనని ఒక్కసారి కాదు వందసార్లు షూట్ చేయాలి” అని తన నోటి దురుసుతనాన్ని ప్రదర్శించుకొన్నారు. మళ్ళీ తాజాగా ముఖ్యమంత్రి కెసిఆర్ పై కూడా నోరు పారేసుకొన్నారు.
గ్యాంగ్ స్టర్ నయీముద్దీన్ కెసిఆర్ కుటుంబ సభ్యులకి ఇబ్బంది కలిగిస్తున్నందునే ఎన్ కౌంటర్ చేయడానికి అనుమతించారని లేకుంటే నయీంకి ఏమయ్యుండేది కాదని నారాయణ అన్నారు. నక్సల్స్ ని ఏరివేయడం కోసం ప్రభుత్వాలే నయీంని పెంచి పోషించాయని, ఇప్పుడు తమనే ఇబ్బంది పెడుతుండటంతో ఎన్ కౌంటర్ చేసి పడేసిందని అన్నారు.
నయీంని కొందరు మంత్రులు, పోలీసు అధికారులు వాడుకొన్నారని మీడియాలో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అతని చేతిలో చనిపోయిన పోలీస్ అధికారులు, నక్సల్స్, రాజకీయ నాయకుల జాబితా ఆ వార్తలకి బలం చేకూరుస్తున్నట్లే ఉన్నాయి. ఆ సంగతి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం తేలుస్తుంది.
మీడియాలో నయీం గురించి వస్తున్న వార్తలు ఇప్పటికే ప్రజలలో అనవసరమైన గందరగోళం సృష్టిస్తున్నాయి. నారాయణ వంటి బాధ్యతగల రాజకీయ నాయకులు కూడా ఈ విధంగా మాట్లాడటం మంచిదికాదు. నయీం బ్రతికున్నప్పుడు అతని గురించి మాట్లాడేందుకు సాహసించని వారందరూ ఇప్పుడు అతని గురించి తెగ మాట్లాడేస్తున్నారు. మీడియా ఛానల్స్ తమ రేటింగ్స్ పెంచుకోవడం కోసమే నయీం గురించి కధలు కధలుగా వర్ణించి చెపుతోంది. కానీ అతనేమైనా దేశభక్తుడా లేకపోతే సమాజానికి ఏమైనా మేలు చేశాడా? అటువంటి సంఘ విద్రోహుల గురించి మీడియా, రాజకీయ నేతలు ఇంతగా చర్చించవలసిన అవసరం ఉందా అని ఆలోచించుకొంటే మంచిది.