తెలంగాణలో కాంగ్రెస్, భాజపాల కీచులాటలు చూస్తుంటే చాలా నవ్వొస్తుంది. తెరాస ధాటికి తట్టుకోలేక విలవిలలాడుతున్న ఆ రెండు పార్టీలు దానికి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగే ప్రయత్నాలు చేయకుండా ఒక దానిని మరొకటి నిందించుకొంటూ కాలక్షేపం చేస్తున్నాయి. ఇటీవల జరిగిన గజ్వేల్ సభలో ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి కెసిఆర్ ఒకరినొకరు, ఒకరి ప్రభుత్వాన్ని మరొకరు పొగుడుకోవడంతో ఆ రెండు పార్టీలు పొత్తులు పెట్టుకొనేందుకు చాలా ఆరాటపడుతున్నాయని, భవిష్యత్ లో ఏదో ఒకరోజు అవి తప్పకుండా చేతులు కలుపుతాయని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి జోస్యం చెప్పారు.
ఆయన జోస్యం నిజమవుతుందో లేదో కాలమే చెపుతుంది. కానీ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు డా.లక్ష్మణ్ ఆయన మాటలని ఖండించారు. కాంగ్రెస్ పార్టీయే అధికార దాహంతో తెరాసతో, మజ్లీస్ పార్టీలతో పొత్తులకి సిద్ధం అయ్యిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ అగమ్యగోచరంగా మారడంతో ఏం చేయాలో పాలుపోక ఉత్తమ్ కుమార్ రెడ్డి ఊహాగానాలు చేస్తూ కాలక్షేపం చేస్తున్నారని విమర్శించారు.
ఒకవేళ తెరాస-భాజపాలు పొత్తులు పెట్టుకోదలిస్తే అదేమీ నేరం కాదు. దానికి కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం చెప్పడానికి వీలులేదు కూడా. రాష్ట్ర విభజన చేస్తే తెరాసని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని మాట ఇచ్చిన కెసిఆర్, విభజన జరిగిన తరువాత హస్తం పార్టీకే హ్యాండ్ ఇచ్చినప్పుడు, కనీసం మాతో పొత్తులకైనా అంగీకరించమని కాంగ్రెస్ నేతలు కెసిఆర్ ని ప్రాధేయపడటం అందరికీ గుర్తుంది. కానీ కెసిఆర్ అంగీకరించక పోవడంతో కాంగ్రెస్ పార్టీయే తెలంగాణ ఏర్పాటు చేసినప్పటికీ దెబ్బయిపొయింది.
ఆ మధ్య సూర్యాపేటలో భాజపా సభ జరిగినప్పుడు తెరాసతో స్నేహం చేయడానికి తాము ఆసక్తిగా ఉన్నట్లు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సంకేతాలు ఇచ్చారు. కానీ దానిని కూడా కెసిఆర్ నిర్ద్వందంగా తిరస్కరించారు. అంటే కాంగ్రెస్, భాజపాలు రెండూ కూడా తెరాసతో పొత్తులకి ఆశపడుతున్నాయనే స్పష్టం అయ్యింది. ఆ రెండు పార్టీలు వాదనలు వింటుంటే, ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం మహా నేరం, మహా పాపం అన్నట్లుగా ఉన్నాయి. కానీ రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో ఆ రెండు ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకోకుండా సొంతంగా అధికారంలోకి వచ్చే పరిస్థితులు కనబడటం లేదు. అందుకే జాతీయ స్థాయిలో ఎన్డీయే, యూపియే కూటములు ఏర్పాటు చేసుకొన్నాయి. రాష్ట్ర స్థాయిలో ప్రాంతీయ పార్టీలతో చేతులు కలపడానికి సిద్ధపడుతున్నాయి. మరి అటువంటప్పుడు ఒక దానిని మరొకటి నిందించుకోవడం దేనికో?