మల్లన్నసాగర్ భూసేకరణపై హైకోర్టు బెంచ్ ఇచ్చిన తాజా తీర్పుతో రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాల మధ్య సాగుతున్న యుద్ధం కొత్త మలుపు తిరిగింది. ఈ వ్యవహారంలో మొదట ప్రతిపక్షాలది పైచెయ్యి కాగా ఇప్పుడు హైకోర్టు తాజా తీర్పుతో అధికార పార్టీది పైచెయ్యి అయ్యింది. నిర్వాసిత రైతులకి న్యాయం చేయడం కోసం కృషి చేయవలసిన అధికార, ప్రతిపక్షాలు ఈ విధంగా రాజకీయాలు చేసుకోవడం దురదృష్టకరమే.
హైకోర్టు తాజా తీర్పుతో దీనిపై కొంత స్పష్టత వచ్చింది కనుక ఇప్పటికైనా ఈ గొడవ చల్లారుతుందనుకొంటే, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి నేటి నుంచి ఈ విషయం పై ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి సిద్ధమయ్యారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు కోసం భూసేకరణ చట్టం-2013 ని అమలు చేయాలని కోరుతూ ఆయన దీక్షకి కూర్చొంటున్నారు.
జీవో:123ని హైకోర్టు సింగిల్ జడ్జ్ కొట్టివేసినప్పటికీ, బెంచ్ లో అప్పీలు చేసుకొని స్టే తెచ్చుకోవడం చాలా అన్యాయమని వాదిస్తున్నారు. ప్రాజెక్టులు కోసం రైతులు, వ్యవసాయ కూలీల పొట్టకొట్టవద్దని హితవు పలుకుతున్నారు. జయప్రకాశ్ రెడ్డి దీక్షకి పోలీసులు అనుమతించలేదు. అది వేరే సంగతి.
ఆయన నిజంగా రైతులు, రైతు కూలీల కోసమే దీక్షకి సిద్ధపడ్డారంటే నమ్మశక్యంగా లేదు. ఆయన తన ఉనికిని చాటుకొనేందుకు గతంలో కూడా ఇటువంటి ప్రయత్నాలు చాలానే చేశారు. ఇది కూడా ఆ కోవలోకే వెళుతుందని అనుకోవచ్చు.
రాష్ట్ర విభజన ప్రక్రియ జోరుగా సాగి తెలంగాణ ప్రజల కలలు సాకారం అవుతున్నవేళ ఆయన రాష్ట్ర విభజనని వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటింఛి అందరి దృష్టిని ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు. అందుకు తెలంగాణా ప్రజల ఆగ్రహానికి గురయ్యారు. ఆ తరువాత తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని వీడి 2014 ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసి మరో పెద్ద తప్పు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని వ్యతిరేకించిననందుకు ఆయనకి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారు. ఆ తరువాత మళ్ళీ కాంగ్రెస్ గూటికి చేరుకొన్నప్పటికీ పార్టీలో ఇదివరకటి ప్రాధాన్యం దొరకడం లేదు. బహుశః అందుకే ప్రస్తుతం చాలా హాట్ టాపిక్ గా ఉన్న మల్లన్నసాగర్ ప్రాజెక్టు భూసేకరణ, జీవో:123 వ్యవహారాన్ని అందిపుచ్చుకొని ఆమరణ నిరాహార దీక్షకి రెడీ అయ్యి తద్వారా తన ఉనికిని చాటుకొని పార్టీలో, రాజకీయాలపై మళ్ళీ పట్టు సాధించాలని ప్రయతిస్తున్నట్లు అనుమానించవలసి వస్తోంది.
ఇదే దీక్షని ఆయన ఇదివరకే చేసి ఉంటే దానికి అర్ధం ఉండేది. కానీ హైకోర్టు జీవో:123కి లైన్ క్లియర్ చేసిన తరువాత దీక్ష చేయాలనుకోవడం చూస్తే, అందులో మెలకువ ఉందనుకోవడంలో తప్పు లేదు.