ప్రతిపక్షాల కోర్టులో బంతి, తెలంగాణ ప్రభుత్వానికి ఊరట

మల్లన్నసాగర్ ప్రాజెక్టు భూసేకరణ కొరకు జారీ చేసిన జీవో:123ని హైకోర్టు సింగిల్ జడ్జ్ రద్దు చేయడం, ఆ తీర్పుపై తెలంగాణ ప్రభుత్వం హైకోర్టు ధర్మాసనంలో అప్పీలు చేసుకొన్న సంగతి తెలిసిందే. దానిపై నేడు విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం, ఈ ప్రాజెక్టు వలన భూములు, ఉపాధి, నివాసాలు కోల్పోతున్న రైతులు, రైతు కూలీలకి, ఇతరులందరికీ పూర్తి న్యాయం చేసే విధంగా మరో కొత్త జీవోని జారీ చేస్తామని తెలంగాణ అడ్వకేట్ జనరల్ హామీ ఇవ్వడంతో సింగిల్ జడ్జ్ ఇచ్చిన తీర్పుని నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే తుది తీర్పుకి లోబడే భూముల క్రయవిక్రయాలు జరపాలని హైకోర్టు ఆదేశించింది. రెండు రోజులలో కొత్త జీవోని జారీ చేసి దాని కాపీని తమకి సమర్పించాలని ఆదేశిస్తూ ఈ కేసుని ఎల్లుండికి వాయిదా వేసింది.

ఈ జీవో వ్యవహారంలో మొదట హైకోర్టులోనే టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలినప్పటికీ మళ్ళీ అదే కోర్టులో అనుకూలంగా తీర్పు రావడం విశేషమేనని చెప్పాలి. అదే విధంగా ఈ జీవోని హైకోర్టు సింగిల్ జడ్జ్ కోర్టు కొట్టివేసినప్పుడు స్వీట్లు పంచుకొని మరీ సంబరాలు చేసుకొన్న ప్రతిపక్షాలు మళ్ళీ పోరాటాలకి సిద్ధం అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది, లేదంటే ఇంతకాలం అవి చేసిన పోరాటాలకి అర్ధం లేకుండా పోతుంది. వాటి ముందు రెండే మార్గాలున్నాయి. 1. హైకోర్టు తీర్పుని సుప్రీం కోర్టులో సవాలు చేయడం. 2.తమ పోరాటాల కారణంగానే తెలంగాణ ప్రభుత్వం దిగి వచ్చి నిర్వాసితుల కోసం ప్రత్యేకంగా జీవో జారీ చేయకతప్పలేదని, కనుక హైకోర్టు తీర్పు తమ విజయమేనని ప్రచారం చేసుకోవడం.

వీటిలో మొదటిది వ్యయప్రయాసలతో కూడుకున్నది. పైగా సుప్రీం కోర్టు కూడా తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునిస్తే తమ పరువే పోతుంది. కనుక రెండవ మార్గం ఎంచుకొంటాయేమో? హైకోర్టు గురువారం తన తీర్పుని ప్రకటించిన తరువాత ప్రతిపక్షాలు తమ కార్యాచరణని రూపొందించుకోవచ్చు.