తెలంగాణ లో ఒకప్పుడు టిడిపి చాలా బలంగా ఉండేది. రాష్ట్ర విభజన తరువాత కూడా అధికారంలో రావాలని విశ్వప్రయత్నం చేసింది కానీ సాధ్యం కాలేదు. అయినా తన సత్తా చాటుకొంటూ 14 ఎమ్మెల్యే సీట్లని గెలుచుకొంది. కానీ ఆ తరువాత టిఆర్ఎస్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ దెబ్బకి వారిలో 12మంది గోడ దూకేయడంతో రాష్ట్రంలో పార్టీ పూర్తిగా బలహీనపడింది. ఓటుకి నోటు కేసు కారణంగా చంద్రబాబు కూడా పార్టీకి దూరం కావడంతో ఇంకా బలహీనపడింది. కానీ నేటికీ అది తన ఉనికిని ఎదో విధంగా చాటుకొంటూనే ఉంది. కనుక ఆ పార్టీ రద్దయినట్లు లేదా టిఆర్ఎస్ లో విలీనం అయినట్లు భావించలేము. కానీ టిడిపి నుంచి ఆ పార్టీలో చేరిన ఎర్రబెల్లి దయాకర్ రావు అభ్యర్ధన మేరకు టిడిపిని టిఆర్ఎస్ లో విలీనం చేస్తున్నట్లు స్పీకర్ మధుసూదనాచారి ప్రకటించడంపై టిడిపి ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఫిరాయింపుల చట్ట ప్రకారం టిఆర్ఎస్ లో చేరిన టిడిపి ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయమని తాము చేసిన అభ్యర్ధనలని స్పీకర్ పట్టించుకోలేదు కానీ ఎర్రబెల్లి దయాకర్ రావు రాసిన లేఖపై తక్షణమే స్పందిస్తూ టిడిపిని టిఆర్ఎస్ లో విలీనం అయినట్లు స్పీకర్ ప్రకటించడాన్ని తప్పు పడుతూ రేవంత్ రెడ్డి హైకోర్టులో నిన్న ఒక పిటిషన్ వేశారు. టిడిపి ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయమని కోరుతూ తాము ఇచ్చిన లేఖలపై ముందు నిర్ణయం తీసుకోకుండా, దయాకర్ రావు లేఖని పరిగణనలోకి తీసుకొని టిడిపిని టిఆర్ఎస్ లో విలీనం చేయడం తప్పు అని రేవంత్ రెడ్డి తన పిటిషన్ లో పేర్కొన్నారు. దానిని విచారణకి స్వీకరించిన హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి నోటీస్ జారీ చేసి కేసుని రెండు వారాలకి వాయిదా వేసింది.
ఇందులో సాంకేతికపరమైన, చట్టపరమైన అంశాలని పక్కన బెట్టి చూసినట్లయితే, నేటికీ తెలంగాణ లో తన కార్యకలాపాలని సాగిస్తున్న టిడిపిని టిఆర్ఎస్ లో విలీనం చేయడం తప్పేనని చెప్పకతప్పదు. టిడిపి ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి మళ్ళీ ఉపఎన్నికలకి వెళ్లేందుకు టిఆర్ఎస్ సిద్ధంగా లేదు కనుకనే వారిపై అనర్హత వేటు పడకుండా తప్పించేందుకు తనకి అందుబాటులో ఉన్న ఈ మార్గాన్ని ఎంచుకొన్నట్లు అర్ధం అవుతోంది. చట్టం అనుమతిస్తే వారిని టిఆర్ఎస్ లో చేర్చుకోవచ్చు కానీ టిడిపిని అనుమతి లేకుండా ఆ పార్టీని టిఆర్ఎస్ లో విలీనం చేయడం తప్పేనని చెప్పకతప్పదు.
దానిని విలీనం చేసినట్లు చెప్పుకొన్నప్పటికీ టిడిపి యధాప్రకారం తన కార్యకలాపాలు కొనసాగిస్తూనే ఉంది. ప్రతీ ఎన్నికలలో పోటీ చేస్తూనే ఉంది. దానిని ఎన్నికల సంఘం కూడా గుర్తిస్తోంది. మరి అటువంటప్పుడు టిడిపిని టిఆర్ఎస్ లో విలీనం చేసినట్లు ప్రకటించడం సబబేనా? దాని వలన ఎమ్మెల్యేలని అనర్హత వేటు పడకుండా కాపాడటం తప్ప వేరే ప్రయోజనం ఏమైనా ఉంటుందా అంటే లేదనే చెప్పవచ్చు.