గ్యాంగ్ స్టర్ నయీమ్ ఇంట్లో డబ్బుల కట్టలు కుప్పలు తెప్పలు..!

మావోయిస్టుగా జీవితాన్ని ప్రారంభించి.. తరువాత కోవర్టుగా మారిన ఆ తరువాత పోలీసులకే సవాల్ విసురుతూ.. మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేరి భూ అక్రమణలు, సెటిల్ మెంట్లతో రియల్టర్ల నుంచి బడా రాజకీయ వేత్తల వరకు అందరినీ వణికిస్తూ.. ఎదిగిన గ్యాంగ్ స్టర్ నయీముద్దీన్ అలియాస్ నయీం ను పోలీసులు హతమార్చడంతో తెలంగాణలోని పలువురు వ్యాపారవేత్తలతో పాటు రాజకీయ వేత్తలు కూడా ఊపిరిపీల్చుకుంటున్నారు. నల్లమల కోబ్రాస్, నర్సా కోబ్రాస్, కాకతీయ కోబ్రాస్ పేరుతో చలామణి అయిన నయీమ్ ను తుదకు తాను నమ్ముకున్న, పట్టుకున్న ఆయుధమే తనను బలితీసుకుంది. 

ఆయన మరణంతో ఆయన ఇళ్లు, గెస్ట్ హౌస్ లపై ఉదయం నుంచి దాడులు చేస్తున్న పోలీసులు అటు భువనగిరిలోని ఆయన నివాసంలోనూ తనిఖీలు చేశారు. ఇద్దరు డీఎస్పీలు, నలుగురు ఏఎస్పీలు తనిఖీల్లో పాల్గొన్నారు. నయీం ఇంట్లో భారీగా వున్న నగదును చూసిన పోలీసులు విస్తుపోయారు. డబ్బుల కట్టలు పెద్ద సంఖ్యలో వుండటంతో నాలుగు మనీ కౌంటింగ్ మెషీన్లను సాయంతో దాన్ని లెక్కపెట్టారు. నయీం ఇంటిచుట్టూ భారీగా పోలీసులు మోహరించారు.

రూ.38.50 లక్షలు, 3 పిస్తోళ్లతో పాటు 22 రౌండ్ల బుల్లెట్లు, 25 సేల్స్ డీడ్ డాక్యుమెంట్లు, పలు వాహనాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. మారుపేరుతో ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ సీజ్ చేశారు. నల్లగొండ జిల్లాలో పలు ప్రాంతాల్లో పోలీసులు నయీం అనుచరులు, బంధువుల ఇళ్లల్లో సోదాలు చేశారు. మిర్యాలగూడలో నయీం అత్త, ఆమె అక్క ఇళ్లల్లో సోదాలు చేసి 6.50 లక్షల రూపాయల నగదు, రెండు బ్యాగుల్లో డాక్యుమెంట్లు, బంగారం స్వాధీనం చేసుకున్నారు. భువనగిరిలో నయీం ఇంటి తో పాటు, అతని అనుచరుల ఇళ్లల్లోనూ తనిఖీలు చేపట్టారు. పోలీసులు భువనగిరి ఎంపీపీ వెంకట్ యాదవ్ ను అదుపులోకి తీసుకున్నారు. 

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండల పరిధిలో పోలీసులు సోదాలు చేసి నయీం అనుచరులు ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. నయీం అనుచరుల ఇంట్లో కోట్లాది రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. రెండు కౌంటింగ్ మిషన్లతో డబ్బును లెక్కిస్తున్నారు. పోలీసులు రెండు వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆర్థిక వ్యవహారాలకు నయీం ఈ ఇంటిని అడ్డాగా వాడుకున్నట్టు భావిస్తున్నారు. నయీం హతమైన సంఘటనా స్థలాన్ని ఎస్పీ రమా రాజేశ్వరి పరిశీలించారు. నయీం భార్య, కూతురు, అత్త, బావమరిదిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.